.

తేది 24-03-2010 శ్రీరామనవమి నాటికి 19 కోట్ల, 17 లక్షలకు పైగా శ్రీరామనామముల సేకరణ గురుదేవులు శ్రీ ఆంజనేయస్వామి దయవలన పూర్తి అయినవి. ..... ఒక సాధకుని ఆత్మ కధ -6 .

నిరంతరము శ్రీ రామ మంత్రమును జపిస్తూ ఉండే పరమేశ్వరుడు కాశీకి వచ్చిన భక్తులు చనిపోతుంటే వారి చెవిలో శ్రీరామనామమును పలికి వారికి మోక్షమును సుగమమును చేస్తాడు. ఆ పార్వతీ పరమేశ్వరుడు అనుగ్రహించాడేమో ?

నిరంతరము హనుమాన్ చాలీసాను, శ్రీరామ నామమును భక్తుల చేత పలికిస్తున్నందుకు అసాద్య సాధక సాధనపరుడైన గురుదేవులు శ్రీ ఆంజనేయస్వామి దయ కలిగిందో ?

దైవ స్వరూపులయిన శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్యస్వామివారి వాత్సల్య పూరిత మంగళాశాశనముల వలననో ?

ప్రత్యక్ష దైవములయిన మా అమ్మగారు కీ.శే. వెంకటరత్నముగారు మరియు మా నాన్నగారు కీ. శే. భాస్కరరావుగారుల ప్రేమపూరిత వాత్సలముల వలనో ?

-- యీ సాధకునికి అనన్య సామాన్యమయిన అసాధ్యమయిన సామూహిక శ్రీరామనామ లిఖిత జపము సాధ్యపడినది.

ఈ సాధకునికే ఆశ్చర్యముగా వింతగా మొత్తము 21 కోట్లు శ్రీరామ నామములు సేకరించబడినా అందులో 2 కోట్లు నామములలో స్పష్టత లేదు. చాలామంది సముద్రపు అలలలాగానో లేక ఉత్తి సున్నాలనో వ్రాశారు. అవన్నీ తీసివెయగ

19 కోట్లు శ్రీరామ నామములు



పూర్తి
అయినాయి.


పందొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరము జనవరిలో సామూహిక శ్రీరామకోటి లిఖిత యజ్ఞము ప్రారంభమయ్యింది. అప్పటినుండి రెండు వేల నాల్గవ సంవత్సరము వరకు మొత్తము పదమూడు కోట్ల శ్రీరామనామములు సద్వినియోగమయిన వివరములు:-

విశాఖలో, కొత్త వెంకోజీ పాలెమునందు శ్రీ జ్ఞానానంద ఆశ్రమములో 5 కోట్లు శ్రీరామనామములు 15 అడుగుల శ్రీరామకోటి స్థూపమునందు నిక్షిప్తము జరిగినవి.

విశాఖ , బర్మా కేంపులో ఒక కోటి శ్రీరామనామములు శ్రీ సీతారామ విగ్రహముల ప్రతిష్ఠ సమయములో నిక్షిప్తము చేయబడినాయి.

విశాఖ, రైల్వే న్యూకోలనీ లోగల పరదేశ రామాలయమునందు ఒక కోటి శ్రీరామనామములు అంకితమయినాయి.

విశాఖ ,పెందుర్తి సాధు ఆశ్రమము నందు హృదయములో శ్రీ సీతా రామ లక్ష్మణులు గల, 25 అడుగుల శ్రీ ఆంజనేయస్వామి విగ్రహ హృదయ స్థానములో ఒక కోటి శ్రీరామనామములు నిక్షిప్తము చేయబడినవి.

విశాఖ, అల్లిపురము వద్ద శ్రీ వేంకటేశ్వర మెట్ట యందు గల హరే రామ మందిరములో 4.5 కోట్లు శ్రీ రామ నామములను మందిరము అభివృద్దికి ఉంచితే విగ్రహ ప్రతిష్ఠాపన సమయములో నిక్షిప్తము జరిపించిరి.

ఒక భక్తులు కోటి శ్రీరామనామములు వ్రాద్దామనుకున్నారు కానీ వ్రాయలేకపోయారు. ఏభై లక్షల వరకు వ్రాయగలిగారు. భద్రాచలము వెళ్తున్నాను మీరు 50 లక్షల శ్రీరామనామములు యిస్తే రామయ్యకు కైంకర్యము చేస్తానని అడిగారు. ఆయన ఆర్తి, ఆయన వయస్సు చూసి 50 లక్షల శ్రీరామనామములు ఆయనకు యివ్వడము జరిగింది.

మొత్తము 13లక్షల శ్రీరామనామములు రామయ్యకు కైంకర్యము అయినాయి.

ప్రస్ఠుతము 6 కోట్లు
శ్రీరామనామములు ఉన్నవి.



[S.K అనగా సుందరకాండ అనియు, అంకెలు శ్రీరామనామముల సంఖ్యలనియు గమనించమని కోరిక.]
[ శ్రీరామనామములు]
01/05 విశాఖ.శాంతి ఆశ్రమములో. ............................. S.K. 487--- 4,00,000.
03/05 విశాఖ జగన్నాధస్వామి ఆలయం ....................... S.K. 491--- 4,00,౦౦౦.
03/05 చాగల్లు.[wg]షుగర్ ఫేక్టరీ ................... S.K. 493--- 21,80,౦౦౦.
04/05 విశాఖ.మర్రిపాలెం NH5 ................................... S.K. 496--- 3,00,౦౦౦.
05/05 మడపాం.SKLM.Dt,[175అ.హనుమ] .............. S.K. 499---24,00,౦౦౦.

07/05 గొల్లల మామిడాడ.రామాలయం.[E.G ] ................. S.K. 505--- 7,20,౦౦౦.
08/05 అనపర్తి.శ్రీ సాయి,శ్రీరామ మందిరం.[E.G] .............. S.K. 506-- 14,00,౦౦౦.
09/05 విశాఖ.శ్రీ కన్యకా పరమేశ్వరీ ఆలయం. ..................... S.K. 508---3,00,౦౦౦.
11/05 విశాఖ.కైలాసపురం. శ్రీరామ,వేంకటేశ్వర ఆలయం. ...... . S.K 514--- 3,00,౦౦౦.
11/05 తాపేశ్వరం.ఉమా రామలింగేశ్వర ఆలయం [E.G] .......... S.K515--- 5,00,౦౦౦.

01/06 భద్రాచలం.శ్రీ సీతా రామచంద్రమూర్తి ఆలయం. ..............S.K---516--5,00,౦౦౦.
02/06 విశాఖ.శాంతి ఆశ్రమం. ........................................... S.K 518--- 1,00,౦౦౦.
04/06 విశాఖ.రాజీవ్ నగర్.రామ ఆలయం. .........................SK 524---. 15,00,౦౦౦.
04/06 విశాఖ.శ్రీ వైభవ వేంకటేశ్వరస్వామి ఆలయం. ............... S.K525---. 6,00,౦౦౦.
05/06 అనపర్తి. E.G శ్రీ ఆంజనేయరెడ్డి కళ్యాణమండపం. ..........S.K 530---. 3,20,౦౦౦.
05/06 జగదల్ పూర్. [చత్తీశ్ ఘడ్ ] రుద్రయాగం.--- .................................... 70,000 .
06/06 శ్రి వేంకటేశ్వర రావు గారి యిల్లు. ................................. S.K 531--- 1,00,000.
09/06 నేలకొండపల్లి. శ్రీ భద్రాచల రామదాసు గారి స్వగృహము. ..... .S.K 545- 6,30,000.
10/06 విశాఖ. మురళీ నగర్. అమ్మ రెసిడెన్సీ ......................... S.K 548--- 6,50,000.
11/06 జియ్యమ్మ వలస.[VZM జిల్లా]. ................................. S.K 550-- 12,75,000.
111/06 నరసన్నపేట.శ్రీకాకుళం జిల్లా. పంచాయత్ ఆఫీస్సులో .........S.K 551- 20,00,000.
12/06 కొత్తూరు. శ్రీకాకుళం జిల్లా.వేంకటేశ్వరస్వామి ఆలయములో..S.K553--- 25,50,000.
2007 లో చాగల్లు.W.G. షుగర్ ఫేక్టరీ. .......................... S.K561--- 7,00,000.
2007 లో భీమిలి.విశాఖ జిల్లా. సుందర వనము ఆశ్రమము. . .......... S.K565--- 5,00,000.
2007 లో రాయఘడ్.[ఒరిస్సా] శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం. ....... S.K 567--.-9,50,000.
2007 లో విశాఖ.వడ్లపూడి కోలనీ. శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయము... S.K 560---5,00,000.
2007 లో కోటబొమ్మాళి. శ్రికాకుళం జిల్లా. కళ్యాణమండపం. ............... S.K -------9,00,000.
2008 లో ఖమ్మం. శ్రీ వేంకటేశ్వర ఆలయం.----------------------------------- - 5,30,000.
2009 లో విశాఖ. మురళీనగర్. స్కేటింగ్ పార్కు.. ------------------- S.K618--- 9,00,000.
2009 లో. విశాఖ. నడుపూరు.శ్రీ రామ ఆలయము.----------------- . S.K 619---2,00,000.
2009 లో భీమవరం. W.G శ్రీ రామ ఆలయము. . .................... S.K 620---5,00,000.
2010 లో వడ్లపూడి కోలనీ. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయము. ....... s.k 632--- 5,00,000.

పై కార్యక్రమములలో సేకరించబడినవి మొత్తము -- 2కోట్ల, 53లక్షల, 75వేలు.

ఇంటివద్దకు వచ్చి పుస్తకములు తీసుకొని వ్రాసి యిచ్చినవారూ,

వారు వ్రాసినవి తెచ్చి యిచ్చినవారివీ కలిపి -3కొట్ల, 63లక్షల, 49వేల, 713.



మొత్తము 6కోట్ల ,17లక్షల, 24వేల,


713 నామములు ప్రస్ఠుతము ఉన్నవి.


ఇన్ని చేయించిన స్వామి యీ శ్రీరామనామములను యెవరి ద్వారా, యెక్కడ సద్వినియోగము చేయిస్తారోనని యీ సాధకుడు యెదురు చూస్తున్నాడు.

జై మారుతీ! జై జై మారుతీ !!
స్వామి రక్ష ! శ్రీరామ రక్ష !!


శ్రీరామ రక్ష ! సర్వ జగద్రక్ష !!


మాతృ దేవో భవ ! పితృ దేవో భవ !! ఆచార్య దేవో భవ !!!






.

శ్రీరామనవమి సందర్భముగా పూర్తి అయిన 632వ సుందరకాండ కధాగానము.






విశాఖలో , వడ్లపూడి కొలనిలో , శ్రీ వేంకటేశ్వరస్వామి వారి మరియు శ్రీ రామచంద్రస్వామి వారి ఆలయములో తేది 16-03-2010 న ప్రారంభమయిన 632 వ సుందరకాండ కధాగానము యీ రోజున అనగా తేది 23-03-2010న పూర్తి అయినది.
యీ 8 దినములలో భక్తులనుండి ' 5 లక్షలకు పైగా శ్రీరామ నామములు సేకరింపబడినవి సుందరకాండ పూర్తి అవగానే శ్రీరామ నామములు వ్రాయబడిన పుస్తకములకు ఆలయ అర్చకులచే ముందుగా సంప్రోక్షణ చేయించి , మంచి ముత్యములతో అర్చన చేయించి , యీ రోజు కార్యక్రమమునకు వచ్చిన వందలాది భక్తులు అందరికీ ఒక్కొక్క మంచి ముత్యము అందజేయడము జరిగినది.
ఆ ముత్యమును శరీరమునకు తాకినట్టుగా ధరించమని చెప్పడము జరిగినది.ఆ సందర్భముగా పంచ లోహములతోను మరియు నవ రత్నములతోను చేయబడిన ఆభరణములు శరీరానికి తాకినట్టుగా ధరించవలెనని చెప్పడం జరిగినది.


సుందరకాండ కధ గానము సందర్భముగా శ్రీ రామ అపచార దోష నివృత్తికై ప్రతి కుటుంబము వారిచే 5అరటి పళ్ళను శ్రీ సీతా రాములకు నివేదన చేసి వాటిని ప్రసాదముగా తీసుకోవడము జరిగినది.

అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలతో........

జై మారుతీ ! జై జై మారుతీ !!

స్వామి రక్ష ! శ్రీరామ రక్ష !!

శ్రీరామ రక్ష ! సర్వ జగద్రక్ష !!



.

మహా మనీషి , సద్గురువులకు గురువు, శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్యస్వామి వారి 88 వ జయంతి శ్రీరామనవమి నాడే!




ప్రవచన శిరోమణి , ఉభయ వేదాంత ప్రవక్తకులు , మహా మహోపాధ్యాయులు , దైవాంశ సంభూతులు శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్యస్వామి వారి జయంతి సందర్భముగా వారితో పరిచయమున్న ఒక సాధారణ భక్తుడుగా వారితో గల కొద్దిపాటి పరిచయమును పునస్కరించుకొని వారి గురించి మన అంతర్జాల మితృలకు తెలియజేసే సాహసమునకు పూనుకుంటున్నాను.

అస్సలు అటువంటి మహనీయుని గురించి మాట్లాడడానికే యెటువంటి అర్హత గాని , స్థాయి గాని , పరిజ్ఞానము గాని యీ సాధకుడికి లేవు. అయినా సాహసము చేస్తున్నాను. శ్రీరాముడు చాతుర్వర్ణాలవారికీ దేవుడే! శ్రీరాముని పూజించే అవకాశము అందరికీ ఉంది. అదే విధముగా గొప్ప వారిగురించి రెండు మాటలు చెప్పుకునే అవకాశము యీ సాధకునికీ ఉంది.

కొన్ని వేలమంది వారి ఉపన్యాసము వింటుంటారు. అయితే ప్రతీ ఒక్కరికీ వారు తనతోనే చెప్తున్నారన్న భావము కలుగుతుంది. సాధారణ భక్తులకూ , మహా జ్ఞానులకూ యెవరి స్థాయికి తగ్గట్టుగా వారికి అర్ధమవుతుంది. ఇది అపూర్వము.

దివంగత తెన్నేటి విశ్వనాధం గారు దేశ భక్తులు , విశాఖవాసులకు ప్రియమైన వారు. ఆయన తన సన్నిహితులతో ' కొంత మంది మాట్లాడుతుంటే వినాలి అనిపిస్తుంది. కొంతమంది మాట్లాడుతుంటే చాలా బాగా మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. కాని శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్యస్వామి వారు మాట్లాడుతుంటే సాక్షాత్తూ సరస్వతీదేవి వారి నాలుక మీద నాట్యము చేస్తున్నాదా ! అనిపిస్తుంది ' అని తరచుగా అనేవారు.

వారివద్ద కొన్నాళ్ళు బ్రహ్మ సూత్రాలు మొదలగునవి నేర్చుకొని వారు పెట్టిన పరీక్షలలో ఉత్తీర్ణులయి కొందరు జియర్ స్వాములు అయ్యారని పెద్దలు చెప్తారు.

అప్పలాచార్యస్వామి వారికి ధనిక ,పేద అన్న తేడా లేదు. తన వద్దకు వచ్చిన భక్తులను వారు ఆదరించే తీరు అమోఘము. దైవ కార్యాలలో వారి సలహాల కోసము వచ్చిన వారికి వచ్చిన వారి స్థాయికి తగ్గట్టుగా సూచనలు యిస్తారు. వారిగురించి యిలా యెంత చెప్పినా తక్కువే అవుతుంది.

యీ సాధకునికి వారితో యెన్నో విషయాలలో కొద్దిగా సాన్నిహిత్యము యేర్పడింది.

మొదటగా 3 నెలలలో సామూహికముగా ఒక కోటి శ్రీరామనామములు వ్రాయించగలిగానని వారే నన్ను పిలిపించుకొని 1986 జూన్ నెలలో పూజా కార్యక్రమాన్ని దగ్గరుండి జరిపించారు.

యీ సాధకుడు 4 సంవత్సరములు భగవత్ విషయములు సేకరించి ఆధ్యాత్మిక దర్పణము పేరుతో 1/8demmy size లో 200 పేజీలు ముద్రణకు సిద్దపడితే వారు ఓపికతో అన్ని పేజీలను దిద్ది, మంగళాశాసనములు వ్రాయడమే కాకుండా క్రిష్ణా ఆశ్రమములో అప్పటి పోర్టు ట్రష్టు చైర్మెన్ గారయిన శ్రీమాన్ P.V.R.K.ప్రసాద్ గారితో కలసి 1989 మే నెలలో ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు.

1978 లొ సుందరదాసు M.S.రామారావుగారు ఆశీస్సులతో సుందరకాండ పుస్తకమును యిచ్చినా గురుదేవులు శ్రీ ఆంజనేయస్వామి 1995 మార్చ్ నెలలో గానము చేసే అవకాశము యిచ్చారు. ఒక వారము రోజులుగా సాధన చేస్తున్నాము. ఆ విషయము వారికి యెవరో చెప్పితే వెంటనే నన్ను తీసుకొని రమ్మని చెప్పారు. నెను వెళ్ళితే కొద్దిగా పాడించుకొని తేది 30-03-1995 న వారు వచ్చి మొదటి గానమును ప్రారంభింపజేస్తాను అన్నారు. అప్పటికి ఒక వారము గూడా పూర్తిగా లేదు.స్వామీ కష్టమండీ! అని వేడుకున్నా ఫరవాలేదు మీరు తయారవుతారు అని నమ్మకంగా చెప్పడమే కాకుండా అదే దినమున మొదటి సుందరకాండ కార్యక్రమమును ప్రారంభింపజేసారు.

అర్ధాలతో కూడిన హనుమాన్ చాలీసా మరియు కొన్ని శ్లోకములతో కూడిన పుస్తకమును ముద్రించడానికి మొదటి విరాళము[100 రూపాయలు] వారు యిచ్చి యీ పుస్తకాలు లక్షకు పైగా ముద్రించ బడతాయని మంగళాశాసనము చేశారు. అవి యిప్పటికి ఒక లక్షా పదమూడు వేలు ముద్రించబడిభక్తులచే ఆదరించ బడుతున్నాయి .
ఇక వారి జననము విషయానికి వస్తే వారి తల్లి తండ్రులు సంతానము కోసము సింహ గిరి {శ్రీ సిం హాచలము దేవస్థానము} చుట్టూ ప్రదక్షిణము చేసేరని ,అప్పలాచార్యస్వామి వారు శ్రీ రామ నవమి నాడు జన్మించేరని ,వారు శ్రీ వరాహ లక్ష్మీ నరసిం హ స్వామి వారి మానస పుత్రులని వారి భక్తులు అంటారు.

శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్యస్వామి వారు దైవాంశ సంభూతులు. భౌతికముగా వారు లేకపోవచ్చును గాని కొన్ని వేల మంది హృదయాలలో వారు చిరంజీవిగా వుంటారు.
వారు తన భక్తులను ,అభిమానులను సదా

కాపాడుతుంటారనే నమ్మకము మా అందరికీ వుంది.




.

తేది 17-03-2010 బుధవారము. మొదటిరోజు సుందరకాండ. హనుమ సముద్ర లంఘనం , లంఖిణిని జయించడము.


మనిషి అన్నవాడు యే విధముగా బ్రతకాలి అన్న విషయమై పెద్దలు యేమని చెబుతారంటే బ్రతికి ఉండగానే ' ఛీ వెధవ జన్మ ' అనిపించుకున్నట్టుగా కాకుండా చనిపోయిన తరువాత కూడా బ్రతికి ఉన్నట్టుగా బ్రతకాలని చెబుతారు. ఈ రోజులలో సుందరకాండ అనగానే స్వర్గీయ M.S.రామారావు గారే జ్ఞాపకము వస్తారు. ఆ విధముగా ఆయన చిరంజీవిగా వున్నారు.

వాయుసేనలో నున్న తన కుమారుని క్షేమము కోసము ఆయన వాయుదేవుని కుమారుడయిన ఆంజనేయస్వామిని ఆరాధించారు . అందుకోసము ఆయన తీవ్రముగా తపించేరు. అందుచేతను ఆంజనేయస్వామి దగ్గర కూర్చొని మొదట సుందరకాండను వ్రాయించుకున్నారు. అంతే కాకుండా ఆర్తిగా పాడించుకున్నారు. ఆంధ్ర లోకానికి ఎనలేని కానుకను యిచ్చారు.

అటువంటి మహత్తరమయిన సుందరకాండను ఒక సాధారణమయిన యీ సాధకుని చేత పాడించుకుంటున్నారు.

పక్షిరాజు సంపాతి సీతమ్మ లంకలో ఉన్నాదని చెప్పగానే జాంబవంతులవారు హనుమకు అతనికి చిన్నప్పుడే బ్రహ్మదేమునితో సహా దేవతలందరు తమ శక్తులనీ వరములుగా యిచ్చిన సంగతి గురించి , మునుల శాపము గురించి , శాప విమోచనము గురించి తెలియజేసి నీవు మాత్రమే యీ నూరు యోజనముల సముద్రమును దాటి సీతమ్మను చూసి రాగలవు అని చెప్పి, నువ్వు సీతమ్మను చూసి వస్తేనే మన అందరి ప్రాణములు సుగ్రీవుని బారిన పడకుండా నిలిచివుంటాయని చెప్పి బయలుదేరమని ప్రోత్సహించారు.

శ్రీరాముని కార్యము తన వలన అవుతుందని తెలిసి హనుమ సంతోషముతొ మహేంద్ర గిరి పైకి యెక్కిపోయి తనవారందరితో నేను రాముడు వదలిన బాణములాగ వెళ్తానని చెప్పాడు. అప్పుడే తన బలాన్ని గురించి ,దేవతల వరాల గురించి తెలిసినా . తను వెళ్ళగలనని తెలిసినా ఆ గొప్పదనాన్ని రామునికే ఆపాదించాడు. తద్వారా అహంకారము ఉండకూడదని తన చేతల ద్వారా తెలియజేశాడు.


మైనాకుని
ఉదంతము ద్వారా సత్కారాలలో మునిగిపోయి లక్ష్య సాధనను వదలకూడదని ,సురస ఉదంతము ద్వారా విహిత కర్మలు చేస్తున్నా వాటిని తామరాకు మీద నీటి బొట్టులాగ ఆచరించాలని , సిం హికను సమ్హరించడము ద్వారా నిషిద్ద కర్మలను నిర్దాక్షిణ్యముగా అణచివేయాలని తెలియజేశాడు. 'గోష్పదీకృత వారాశిం ' -అనగా నీటితో నిండిన ఆవు డెక్కను మనము దాటినట్టుగా హనుమ నూరు యోజనముల సముద్రాన్ని దాటాడు. లంకా నగర వైభవాన్ని చూసి చీకటి పడిన తరువాత లంకలోనికి వెళ్తున్న హనమను లంకిణి అడ్డగిస్తే ఎడమచేతి పిడికిలితో చిన్నపాటి దెబ్బ వేసేసరికి లంకిణి లోంగిపోయి యిక లంకకు చేటు తప్పదని చెప్పి లోపలకు వెళ్ళమని రాజమార్గము చూపించించింది. అభినయముతో , M.S రామారావుగారి బాణీలో గానముతో యీ రోజు కార్యక్రమము జరిగింది.
చక్కీర పొంగలి నేవేద్యము జరిగింది. ఆ ప్రసాదము తీసుకున్నవారికి భూత ,పిశాచ బాధలనుండి నివృత్తి జరుగుతుందన్న పెద్దల వచనములు తెలియజేసి అందరము ఆ ప్రసాదమును కళ్ళకు అద్దుకొని తీసుకున్నాము. శ్రీ రామ శరణం మమ !

శ్రీ మారుతీ పద భక్త కొమ్మూరు ఉమాప్రసాద్ భాగవతార్.



.

సుందరకాండ కధా గానములో భాగముగా మొదటి దినము సకల దేవతా స్వరూపుడైన శ్రీ ఆంజనేయస్వామికి భక్తులచే స్వయముగా అభిషేకములు చేయించబడినవి.



తేది 16-03- ౨౦౧౦ మంగళవారము , ఉగాది పర్వదినము సందర్భముగా ముందుగా నిర్ణయించుకున్నట్టుగా సకలదేవతా స్వరూపుడయిన శ్రీఆంజనేయస్వామి [యీ సాధకుడు తీసుకువెళ్ళిన] విగ్రహమునకు -- అభ్యంగ స్నానము చేసి శుచి అయిన వస్త్రములు ధరించి వచ్చిన వారికి , పాంట్ కాకుండా పంచె ధరించి వచ్చిన మగవారికి , భక్తులందరిచేత స్వయముగా అభిషేకములు చేసుకునే అవకాశము కల్పించబడినది. ఈ అపూర్వమయిన అవకాశమును 52మంది దంపతులు సద్వినియోగపరచుకొని సుమారు 130కొబ్బరికాయల జలముతో అభిషేకములు చేసుకొనడమే కాకుండా అభిషేకము చేసుకున్న ప్రతీ 2 కొబ్బరికాయలకు ఒక శ్రీ ఆంజనేయస్వామి రాగి ముద్రికను యెటువంటి రుసుము చెల్లించకుండా పొందారు. వాద్యముల సహకారముతో యీ సాధకుడు పలు రాగములలో శ్రీ హనుమాన్ చాలీసాను ఉత్తేజముగా ఆరాధనతో గానము చేస్తుండగా వందలాది భక్తులు కలసి పాడినారు. అందరికీ హనుమాన్ చాలీసా పుస్తకములు యివ్వబడినవి. 'సామూహిక హనుమాన్ చాలీసా గాన యజ్ఞము ' లో భాగముగా నిర్వహించబడిన యీ కార్యక్రమము కార్యవర్గము వారికి నచ్చి మళ్ళీ చేయగలరా అని యీ సాధకుడిని అడిగారు. సామూహిక శ్రీ రామ కోటి లిఖిత జప యజ్ఞము లో భాగముగా ఆసక్తి గల భక్తులందరికీ 1008 శ్రీ రామనామములు పట్టే పుస్తకములు అందజేయబడినవి. శ్రీ రామనామములను వ్రాసి తెచ్చిన వారికి శ్రీ రక్షా బంధన్ లు యివ్వబడును. మొదటి రోజున వచ్చిన వందలాది భక్తులందరికీ శ్రీఆంజనేస్వామి రక్షాబంధన్ లు యివ్వబడినవి. రేపు సుందరకాండ కధా గానము ప్రారంభింపబడుతుంది. రేపటి కార్యక్రమములో ఆంజనేయస్వామి లంకిణిని జయించిన సన్నివేశమునకు చక్కెర పొంగలి నివేదన చేసి ప్రసాదముగా వితరణ చేయబడును. మహా మహోపాద్యాయులు శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్యస్వామి వారి సూచనల ప్రకారము సుందరకాండలో నివేదనలు చేయబడుతున్నవి.
యత్ర యత్ర రఘునాధ కీర్తనం -
తత్ర కృతమస్తకాంజలిం -
బాష్ప వారి పరపూర్ణలోచనం-
మారుతిం నమత రాక్షసాంతకం.

శ్రీ రామజయం.

.

అభినయపూర్వక ,వ్యాఖ్యానసహిత 632 వ సుందరకాండ కథాగానమునకు స్వాగతాంజలి.



మాతృ దేవోభవ ! పితృ దేవోభవ !! ఆచార్య దేవోభవ !!!

తేది 16-03- 2010 మంగళవారము అనగా వికృతి నామ సంవత్సర ఉగాది నుండి తేది 24-03-2010 బుధవారము శ్రీరామనవమి వరకు 9 దినములు - విశాఖపట్నము , గాజువాక దగ్గర , వడ్లపూడికోలనీలోగల , లక్ష్మీపురమునందు శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయములో వాద్య సహకారములతో యీ సాధకునిచే ప్రతీ దినము సాయంత్రము 06.30 గంటలనుండి 08.30 గంటల వరకు సన్నివేశము కనిపించురీతిలో అభినయముతో , సందర్భానుసారముగా వ్యాఖ్యానముతో , సర్వ సమర్పణముతో 632 వ సుందరకాండ కధాగానము జరిపించబడును. సామూహిక శ్రీరామకోటి లిఖితయజ్ఞము మరియు సామూహిక హనుమాన్ చాలీసా గానయజ్ఞము లు కూడా జరిపించబడును. 1008 శ్రీరామ నామములు లిఖించి సమర్పించిన వారికి శ్రీ ఆంజనేయస్వామి వారి

' రక్షా బంధన్ ' లు అందజేయబడును . గురుదేవులు శ్రీ ఆంజనేయస్వామి దయతో భక్తిపూర్వకముగా జరుగుతున్న యీ దైవ కార్యక్రమమునకు వచ్చి మీరు తరించి మమ్ములను ధన్యులుగా చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాము.

జై మారుతీ ! జై జై మారుతీ !!

స్వామి రక్ష ! శ్రీ రామ రక్ష !!

శ్రీ రామ రక్ష ! సర్వ జగద్రక్ష !!

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము వారిచే యక్ష గాన కళాకారుడిగా గుర్తింపు పొందిన మరియు ఆకాశవాణి విశాఖ వారిచే భక్తి సంగీత కళాకారుడిగా ఎంపిక చేయబడ్డ శ్రీ రామ దాసానుదాసుడు
-- కొమ్మూరు ఉమాప్రసాద్ భాగవతార్.
.

తేది 15-03-2010 ఉగాది ముందు రోజు [ కొత్త అమావాస్య ] - యీ సాధకునకు గల 3 విశిష్టతలు ప్రత్యేకతలు

1. 1995 సం.లో మార్చి నెలలో [ఉగాది ఘఢియలలోనేకాని ఉగాది ముందురోజు] సుందరదాసు M.S.రామారావు గారి సుందరకాండను శ్రీ రామాయణ ప్రవచన శిరోమణి , భగవత్ స్వరూపులు అయిన శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్యస్వామి వారి మంగళాశాశనములతో యీ సాధకునిచే మొదటి సుందరకాండ గానము ప్రారంభింపబడింది.

2. 1996 సం.లో మార్చి నెలలో [ఉగాది ఘఢియలలోనే కాని ఉగాది ముందు రోజు] యీ సాధకుని నాన్నగారు శ్రీ కొమ్మూరు భాస్కరరావు గారు కీర్తిశేషులయి వైకుంఠధామము చేరారు.

3.తేది ప్రకారము యీ సాధకుని[జననము తేది 15-03-1946] జన్మదినము.


మా నాన్నగారి 14వ వర్ధంతి సందర్భముగా వారికి హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను.

శ్లోకము: యస్మాత్ పార్ధివ దేహహ: ప్రాదుర భూద్యేన భగవతా గురుణా !
నంతు నమాంసి సహస్రంతస్మై సర్వజ్ఞ మూర్తయే పిత్రే !!

తాత్పర్యము : ఎవరివలన ఈ భౌతిక శరీరము జన్మించినదో అటువంటి భగవత్ స్వరూపుడైన
సర్వజ్ణమూర్తి అయిన తండ్రికి వేలకొలది నమస్కారములు.


మా నాన్నగారు కీ.శే.కొమ్మూరు భాస్కరరావు గారు తేది 13-04-1909 లో జన్మించారు. తేది 19-03-1996 న పరమపదము చేరారు. వారు అటవీ శాఖలో forest range officer గా పనిచేసేవారు. మా అమ్మగారి నిత్యపూజలు మాకు కనపడేవి కాని నాన్నగారి భక్తి మాకు పైకి కనపడేది కాదు. ఎక్కువగా కేంపులకు వెళ్ళేవారు.ఇంటిలో ఉన్నప్పుడు మాత్రము ఉదయము స్నానము చేయగానే కుర్చీలో కూర్చొని అగరుబత్తీ వెలిగించి కళ్ళు మూసుకొని తదేక ధ్యానములో అర ఘంటకు పైగా ఉండేవారు. పేపర్లలోనివి పుస్తకాలలోనివి దేముడికి సంబంధించినవీ దేశభక్తికి సంబంధించినవీ సేకరించేవారు. ఆయన వ్రాసుకోవడానికి అవకాశము లేనప్పుడు మా చెల్లెళ్ళ చేత వ్రాయించుకునేవారు. అవన్నీ సుమారు 18 పుస్తకాలలో ఉన్నాయి. ఆంగ్లము లోను ,తెలుగులోను సేకరించారు. వాటికి ఆయన A READERS HAARVEST అని పేరుపెట్టుకున్నారు. అందులో భక్తికి సంబంధించినవాటిని [ తెలుగు లోనున్నవి ] యీ సాధకుడు విజ్ణానభాస్కరం అని పేరుపెట్టి వాటిలోనివి అప్పుడప్పుడు యీ [ blog] అంతర్జాలము లో వ్రాస్తున్నాడు.
అంతర్జాలమితృలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

జై మారుతీ ! జై జై మారుతీ !!
.

మొదటి శ్రీ రామకోటి నామములకు ఊహాతీతముగా, అద్భుతముగా పూజ జరిపించిన గురుదేవులు శ్రీ ఆంజనేయస్వామి. --- ఒక సాధకుని ఆత్మకధ -5.




శ్రీ రామనామములు వ్రాసిన వారిలో ఒకరయిన భీమనాధం త్రినాధరావుగారు [ యీ సాధకునికి బావగారు ] ఒక రోజు వచ్చి, మూడు నెలలలో అందరిచేత కోటి శ్రీరామనామములను మీరు వ్రాయించారని శ్రీభాష్యం అప్పలాచారిస్వామివారికి నేను తెలియజేశాను . అది వినగానే స్వామివారు ఆయనను నేను చూడాలి వెంటనే తీసుకొని రండి అన్నారు , పదండి వెళదాము అన్నారు.

ఆ స్వామివారి గురించి నాకు అస్సలు తెలియదు కాని బావగారు రమ్మంటున్నారు కాబట్టి బయలుదేరాము. తోవలో మా బావగారు వారి గురించి చెప్పారు. వారు గురువులకే గురువులు అనీ , వారు రామాయణము చెప్పుతుంటే యెవ్వరూ కదలరనీ , కోటీశ్వరులు కూడా వారి దర్శనము కోసము ఆతృతగా వుంటారనీ ,వారు మిమ్మల్ని చూస్తాను అనడమే చాలా గొప్ప విషయమనీ చెప్పేసరికి నాకు కొద్దిగా భయము వేసింది. అంతటి మహానుభావుల వద్ద యెలా ప్రవర్తించాలో తెలియదు.ఏదైనా పొరపాటు చేస్తానేమో గురుదేవా! ఆంజనేయస్వామీ నువ్వే కాపాడాలి అని ఆంజనేయస్వామికి నమస్కారము పెట్టుకున్నాను.

ఆ స్వామివారు B.H.P.V వద్దనున్న షీలానగరులో వుంటున్నారు. వారి యింటికి వెళ్ళితే అమ్మగారు మా బావగారితో ఆదరముగా మాట్లాడి స్వామివారు

సిం హాచలము వెళ్ళేరని చెప్పి మమ్మల్ని అక్కడకే వెళ్ళమన్నారు.

మేము ఆ వూరిలోనికి వెళ్తుండగానే మా బావగారు స్కూటరు ఆపండి , అదిగో స్వామివారు! అన్నారు. వెంటనే స్కూటరు ఆపి బావగారితో వారివద్దకు వెళ్ళాను. బావగారు యెదురుగా వస్తున్న వారిలో ఒక పెద్దాయనకు రోడ్డుమీదనే పాదాలకు నమస్కరించారు. బావగారితోపాటే నేను కూడా వారికి రోడ్డు మీదే నమస్కరించాను.

వారు ,చాలా గొప్ప విషయము నేను విన్నాను, మిమ్మల్ని చూడాలనిపించి నేనే రమ్మన్నాను. మురళీ నగరులోని మన రామ మందిరములో శ్రీ రామకోటి కార్యక్రమము చేద్దాము అని తనతోనున్న పండితులతో యీ శ్రీ రామ కార్యము మనము చేద్దామని చెప్పి, బాబూ! నేను వచ్చి దగ్గర వుండి చేయిస్తాను అన్నారు. నాకు నోట మాటలు రాలేదు. ఇది కలా ! నిజమా ! అన్నట్టుగా అలాగే ఉండిపోయాను.

తేదీ 17-06-1986 మంగళవారము దశమి నాడు మరియు తేదీ 18-06-1986 బుధవారము ఏకాదశి నాడు కోటి శ్రీ రామనామములకు పూజ , శ్రీ సీతా రాముల కళ్యాణ మహోత్సవము శాస్త్రోక్తముగా జరిగింది. అంతా కలలో జరిగినట్టుగా అయిపోయింది.

యీ సాధకుడు పోర్టు రామాలయము మాష్టారిని అడిగితే శ్రీ ఆంజనేయస్వామి ఆయనచేతే రోడ్డు మీద యెవరో దొరుకుతారు అని చెప్పించడమే కాకుండా యీ సాధకుని స్థాయికి మించి బ్రహ్మాండముగా మహాత్ములచేత చేయించారు.

' తననే నమ్మినవారిని స్వామి తనే నడిపిస్తారు 'అన్నది నాకు నిదర్శనము అయింది.

మనకూ దేవుళ్ళకూ మధ్య పరమగురువులైన 'సప్త మహా ఋషులూ వుంటారనీ , ప్రతీ ప్రాణి తాలూకా ప్రతీ అవయవానికీ అధిష్టాన దేవతలు వుంటారనీ, భగవంతుని కార్యక్రమములు చేసేవారికి, నిస్వార్ధముగా ఆర్తితో దైవ కార్యాలను చేద్దామని ఉన్నా యెలా చేయాలో , యేమి చేయాలో తెలియని వారికి దైవ అనుగ్రహమును కలిగించి సంతృప్తి కలిగిస్తారని యీ సాధకుడు యెక్కడో చదివాడు.

ఇటువంటి అద్భుతమయిన సంఘటనలు యెన్నో జరిగాయి. ఒక్కొక్కసారి యెలా చేయాలో తెలియక సతమతమవుతున్నప్పుడు మన యెదురుగా వున్నవారిద్వారా మనకు కావలసిన విషయము చెప్పిస్తారు. విచిత్రమేమంటే వారికి మనతో ఆ విషయము చెప్పుతున్నట్టుగా తెలియకపోవచ్చును.


జై మారుతీ ! జై జై మారుతీ !!

స్వామి రక్ష ! శ్రీ రామ రక్ష !!

శ్రీ రామ రక్ష ! సర్వ జగద్రక్ష !!

మాతృదేవోభవ ! పితృదేవోభవ !! అచార్య దేవోభవ !!!
.

1986 జనవరి నెలలో "సామూహిక శ్రీ రామ కోటిలిఖిత యజ్ఞము "గురుదేవులు శ్రీ ఆంజనేయ స్వామి దయతో సంకల్పించబడి 3 నెలలలోనే పూర్తి అయ్యింది.ఒక సాధకుని ఆత్మ కధ -4



M.S.రామారావు గారి ఆశీస్సులు అందుకున్న తరువాత వారు యిచ్చిన సుందరకాండ పుస్తకమును భద్రముగా దేముడి పుస్తకాలలో పెట్టి కొన్నాళ్ళకు ఆ పుస్తకము సంగతే మర్చిపోయాను.

అంతవరకు అఫీసులోను , బయటా , యూనియను కార్యక్రమాలలోను , సాంస్కృతిక కార్యక్రమాలలోను , క్రీడా కార్యక్రమాలలోను, నాటకాలలోను ఉధృతముగా పాల్గొంటున్న నన్ను " గురుదేవులు శ్రీ ఆంజనేయస్వామి " భక్తి మార్గములోనికి మార్చారు. కాని భక్తి అంటే పర్వదినములలో అందరితో పాటే అప్పుడప్పుడు పూజా కార్యక్రమములలో పాల్గొనడమే తెలుసు . " శ్రీ ఆంజనేయస్వామి" ప్రభావము వలన కొత్త కొత్త పాటలు పాడుకోవాలనీ ,దేముడికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలని తపన ప్రారంభమయ్యింది. ఎక్కడెక్కడ దైవకార్యాలు జరుగుతున్నా అక్కడకు వెళ్ళి నిశితముగా పరిశీలించడము , పెద్ద పెద్దవారి ఉపన్యాసములను వింటూ అందులో ముఖ్యమయిన విషయములను సూక్ష్మముగా వ్రాసుకొని యింటికి వచ్చిన తరువాత దానిని విపులముగా వ్రాసి ఉంచుకోవడము మొదలయింది. పత్రికలలో దైవమునకు సంబంధించిన విషయములను కత్తిరించుకొని దాచుకోవడము , కత్తిరించడానికి వీలు లేకపోతే వ్రాసుకొని ఉంచుకోవడము ప్రారంభమయ్యింది.

తెలుగు హనుమాన్ చాలీసా గానము అందరికీ నచ్చడమువలన యెవరయినా పిలిస్తే తప్పకుండా వెళ్ళేవాడిని. ఖుర్దా రోడ్డు [ ఒరిస్సా ] నుండి శ్రీ A.CH. సోమయాజులు గారు మలేరియా యిన్స్పెక్టరుగా పదవీ విరమణ చేసి వచ్చారు. ఆయనను 'అపర కబీరు ' అంటారు. వారివద్దకు కొన్నాళ్ళు వెళ్ళాను.

ఆ తరువాత పోర్టు శ్రీ రామాలయము మాష్టారు పిలిస్తే అక్కడకు వెళ్ళేవాడిని. అక్కడే 'తులసీదాసు' హిందీ హనుమాన్ చాలీసా నేర్చుకున్నాను. ఏక ధాటిగా 108 పర్యాయములు సునాయాసముగా పాడడము వచ్చింది.

ఆ రామాలయములలో కొందరు కూర్చొని శ్రీ రామ నామములను వ్రాస్తుంటే చూసి శ్రీ రామ నామములుఒక కోటి సేకరించాలనే సంకల్పము వచ్చింది. ఒక మనిషి తన జీవితములో నిద్రకు , కాలకృత్యములకు సమయము వదలి తక్కిన సమయమంతా శ్రీ రామనామములు వ్రాస్తే ఒక కొటి శ్రీ రామనామములు వ్రాయడానికి ౧౮ సంవత్సరములు పడుతుందని పెద్దలు చెప్పారు. అందుచేత అందరము కలసి కోటి శ్రీ రామనామములు వ్రాద్దామని అందరితో చెప్పాను. విశాఖపట్నము పోర్టులో పనిచేస్తుండడము వలన వందలాదిమందితో సాన్నిహిత్యము ఉంది. శ్రీ రామనామములు వ్రాసే పుస్తకములను కొని ఆసక్తి గలవారికి యిచ్చాను.వారందరినీ వాటిని యిళ్ళకు తీసుకొని వెళ్ళి పుస్తకములోని పేజీలను విడదీసి కుటుంభ సభ్యులంతా వ్రాయండి అనిచెప్పాను.

ఆ విధముగా జనవరి 1986 లో " సామూహిక శ్రీ రామకోటి లిఖిత యజ్ఞము " ప్రారంభమయ్యింది. గురుదేవులు శ్రీ ఆంజనేయస్వామి దయవలన ఆ సంకల్పము రావడము వలన ఆశ్చర్యముగా , విచిత్రముగా కేవలము 3 నెలలలోనే " ఒక కోటి శ్రీ రామ నామములు " సేకరించబడ్డాయి. అందరూ చాలా అశ్చర్యపడ్డారు. శ్రీ రామనామములు వ్రాసి యిచ్చిన భక్తులకయితే వారి ఆనందానికి అవధులు లేవు. నేను ఉబ్బితబ్బిబ్బయిపోయాను. నాకు నెమ్మదిగా "స్వామి" ప్రభావము అవగతమవుతున్నాది. వరుసగా జరుగుతున్న సంఘటనలు కాకతాళీయముగా జరుగుతున్నవి కావని, వీటిని తేలికగా తీసుకోకూడదని అనుకున్నాను. నెమ్మదిగా తక్కిన కార్యక్రమాలు తగ్గించుకోవడము మొదలుపెట్టాను.

శ్రీ రామకోటి పూర్తి అయినందుకు వాటికి పూజాకార్యక్రమము చేయించాలనుకొని పోర్టు శ్రీ రామాలయము మాష్టారు వద్దకు వెళ్ళి శ్రీ రామ నామములకు పూజ చేయమని కోరేను. ఆయన చెప్పిన జవాబు నన్ను నిశ్చేష్ఠునిగా చేసింది. ఆయన చాలా స్థిరముగా చెప్పారు.' మీకు సంకీర్తన చేయడము వరకే వీలు ఉంది. శ్రీ రామనామములు వ్రాయించడము, వాటికి పూజా కార్యక్రమములు చేయించడము అవకాశము లేదు. ఆ పూజ యిక్కడ చేయబడదు ' అని చెప్పారు. ' మీకు ' రోడ్డుమీద పంతులు ' యెవరయినా దొరుకుతారు వా ళ్ళచేత చేయించుకోమని చెప్పారు. సరేనని వచ్చేస్తుంటే ఆగండి కొంతసేపు సంకీర్తన చేద్దామని అన్నారు. కాసేపు సంకీర్తన చేసి యింటికి వచ్చేశాను.

ఇంక సంకీర్తనకు పోర్టు రామాలయమునకు వెళ్ళే అవకాశము లేదని అనుకున్నాను. దైవ కార్యక్రములకు అవకాశము లేని దగ్గరకు వెళ్ళడము " స్వామికి' యిష్టము వుండదనుకున్నాను. తరచుగా వెళ్ళడము మానివేశాను. మరి కోటి శ్రీ రామనామములకు పూజ చేయించే భారము నీదేనని స్వామికి విన్నవించుకున్నాను.

జై మారుతీ! జై జై మారుతీ!!


స్వామి రక్ష ! శ్రీ రామ రక్ష !!


శ్రీ రామ రక్ష ! సర్వ జగద్రక్ష !!




మాతృదేవోభవ ! పితృదేవోభవ !! ఆచార్యదేవోభవ !!!


రామాలయము మాష్టారు నాతో అన్న విషయములు యిలా పైకి తెలియజేయడము సభ్యత కాదు గాని యీ సాధకుడు యెటువంటి ఒడుదుడుకులు యెదుర్కున్నాడో తెలియజేయడమే నా ఉద్దేశ్యము.
.

సుందర దాసు M.s. రామారావు గారిచే వారి సుందరకాండ పుస్తకమును యీ సాధకునకు లిఖిత పూర్వక ఆశీస్సులతో యిప్పించిన గురుదేవులు శ్రీ ఆంజనేయస్వామి.





















'సుందరదాసు M.S.రామారావు ' గారిచే యీ సాధకునకు తేది 11-09-78న వారి సుందరకాండ పుస్తకమును లిఖితపూర్వక ఆశీస్సులతో యిప్పించిన " గురుదేవులు శ్రీ ఆంజనేయస్వామి! "
[ ఒక సాధకుని ఆత్మ కధ ---3

1978 సంవత్సరము జూలై నెలలో మాదంపతులను ఘోరమయిన ప్రమాదము నుండి కాపాడిన గురు దేవులు "శ్రీ ఆంజనేయస్వామి " 1978 సంవత్సరము ఆగష్టు నెలలో " తన అనుగ్రహపాతృలయిన సుందర దాసు M.S రామారావుగారు రచించి గానము చేస్తున్న శ్రీ హనుమాన్ చాలీసాను రేడియో ద్వారా యీ సాధకునికి యిచ్చిన విషయము తేది 05-03-10 న మీకు తెలియజేశాను .
సెప్టెంబరు నెలలో అనగా నెలలోనే 'స్వామి ' ఈ సాధకునకు వెల కట్టలేని కానుక యిచ్చారు. తేది 11-09-1978 నాడు కొందరు సన్నిహితులు వచ్చి శ్రీ సంపత్ వినాయక స్వామి వారి ఆలయములో [విశాఖలోనే] శ్రీ M.S.రామారావుగారు 7 రోజులు సుందరకాండ కధాగానము చేస్తున్నారు, వెళ్దాము రండి అని యీ సాధకుడిని తీసుకొని వెళ్ళారు. వారిని స్వయముగా చూసే అవకాశము లభించినందుకు యెంతో ఆనందముతో వెళ్ళాను. కార్యక్రమము యింకా మొదలు అవలేదు. M S రామారావు గారు అప్పుడే వచ్చారు. నన్ను తీసుకొని వెళ్ళిన పెద్దలు నన్ను వారికి పరిచయము చేశారు 'అయ్యా! ఈయన మీరు గానము చేసిన తెలుగు హనుమాన్ చాలీసాను పాడుతున్నారు ' అని . నేను వినయముగా నమస్కరించాను. ఆయన ' బాబూ ! యేది కొద్దిగా పాడండీ ' అన్నారు. ఆంజనేయ స్వామి అంతటి వారి ముందు నేను కుప్పిగంతులు వేయడమా అనుకుంటూ నెమ్మదిగా మొదటి రెండు ప్రార్ధన శ్లోకాలు పాడాను. వింటూనే ఆయన యేదో పుస్తకము తీసి లోపలి పేజీలో యేదో వ్రాసి సంతకము చేసి 'బావుంది ప్రచారము చేయు నాయనా!' అంటూ ఆ పుస్తకమును నాకు యిచ్చారు. నా ఆనందానికి అవధులు లేవు. కేవలము నా తృప్తికోసము ,నా ఆనందము కోసము పాడుకుంటున్నాను. అటువంటిది ఆయన స్వయంగా ఆ విధముగా అనడము ,యేదో పుస్తకము యివ్వడము నాకు నోటంట మాటలు రాలేదు. ఇంటికి తిరిగి వచ్చిన తరువాత చూసేసరికి ఆ పుస్తకము వారు రచించి గానము చేస్తున్న 'సుందరకాండ!'. అది యిచ్చి ప్రచారము చేయు నాయనా అన్నారు. అప్పటి నా స్థాయికి తెలుగు శ్రీ హనుమాన్ చాలీసా గానమే యెక్కువ! అందు చేత శ్రీ హనుమాన్ చాలీసా గానమునే ప్రచారము చేయమన్నారన్న నిశ్చయమైన అభిప్రాయముతో ఆ పుస్తకమును జాగ్రత్తగా దాచుకున్నాను.
జై మారుతి ! జై జై మారుతి !!
స్వామి రక్ష ! శ్రీ రామ రక్ష !!
శ్రీ రామ రక్ష ! సర్వ జగద్రక్ష !!

అర్ధ సహస్ర సుందరకాండ కథా గాన శిరోమణి - కొమ్మూరు ఉమాప్రసాద్ భాగవతార్

.

గత 31 సంవత్సరములలో 300 లకు పైగా భక్తి గీతములను యిచ్చిన గురుదేవులు శ్రీ ఆంజనేయస్వామి. --ఒక సాధకుని ఆత్మ కధ-2

గురుదేవులు " శ్రీ ఆంజనేయస్వామి " యిచ్చిన తొలి కానుక సుందరదాసు గారి తెలుగు హనుమాన్ చాలీసా!
ఆ చాలీసాను పాడుతున్నప్పుడు అప్రయత్నముగానే నా కనులు మూయబడి ఏదో అవ్యక్త ఆనందము , తన్మయత్నము కలిగి ఒడలంతా జలదరించేది. శ్రీ M.S.రామారావు గారిది ఒక విలక్షణమైన శైలి. ఆ గొంతుకలోనున్న ఆర్తి అయస్కాంతములా ఆకర్షించి యెంతటి వాడినయనా కట్టిపడేస్తుంది. అటువంటి హనుమాన్ చాలీసా నేను పాడగలగడము నాకు యిప్పటికీ ఆశ్చర్యమే!
అది నేను పాడగా విన్నవారు కూడా తన్మయత్వముతో కదిలిపోయి సన్నిహితులకు చెప్పేవారు. ఆ విధముగా విపరీతముగా ప్రచారము అయి మా విశాఖపట్నములో యెక్కడెక్కడో జరిగే కార్యక్రమాలలో ప్రత్యేకముగా పాడించుకునేవారు. అంతటి అదృష్టము పొందగలిగినందుకు ఆ హనుమాన్ చాలీసాను నాకు మొదటి కానుకగా యిచ్చిన గురుదేవులు "శ్రీ ఆంజనేయస్వామికి" నేను దాసోహము అయిపోయాను.

స్వామి యిచ్చిన హనుమాన్ చాలీసా మాత్రమే పాడితే ఆయనకు తృప్తి ఉండదేమోనని భక్తి గీతాలు కొత్తవి నేర్చుకోవాలని ప్రయత్నము మొదలుపట్టాను. ఆ తపనతో ఆలయాలలో జరిగే భజన కార్యక్రమాలకు వెళ్ళేవాడిని. ఎక్కువగా సినిమా పాటల వరుసలలోనే భజనలు జరుగతున్నాయి. అవి పాడుతున్నప్పుడు ఆ సినీమా పాటలలోని భావాలే కలుగుతున్నాయి. అయితే ఆ పాడేవారిని తప్పు పట్టలేము. ఎందుచేతనంటే ప్రతీ వారము ఆలయాలలో భజనలు చేయాలన్న కోరిక వారికి ఉంది. సినిమా పాటలలోని రాగాలయితే వారు సులువుగా పాడగలరు. అంతకన్న వారికి మరో మార్గము లేదు. వారికి భక్తి గీతములు నేర్పేవారు లేరుమరి.

అయితే ఆ మార్గములో నేను వెళ్ళదలచుకోలేదు.
రేడియోలో వచ్చేపాటలు, టేపురికార్డులలోనిపాటలు, భజనలలో భక్తులు పాడే పాటలూ విని నాకు నచ్చినవి సాధన చేసుకునేవాడిని. కచేరీలలో పెద్ద పేద్దవారు పాడే పాటల జోలికి వెళ్ళే సాహసము నాకు లేదు. స్వయముగా శ్రీ ఆంజనేయస్వామే నాకు గురువు కాబట్టి అవిరామ కృషి, నిరంతర సాధన 1978 సంవత్సరములో ప్రారంభమైన ప్రయత్నము యీ రోజున అనగా 31 సంవత్సరములకు 300 ల వరకు భక్తి గీతాలు పాడగలిగే స్థాయికి తెచ్చింది.
మనిషి యేదైనా సాధించాలంటే అతనికి దైవ అనుగ్రహము, పెద్దల అనుగ్రహము, తల్లి తండ్రుల అనుగ్రహముతో పాటే తన అనుగ్రహము కూడా ఉండాలని భగవత్స్వరూపులు, ఉభయ వేదాంత ప్రవక్తకులు, ప్రవచన శిరోమణి, మహా మహోపాధ్యాయ అయిన 'శ్రీ మాన్ శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు ' చెప్పేవారు.
ఈ సంధర్భముగా ఒక కధ చెప్పుకోవాలి. ఒక ప్రియుడికి తన ప్రియురాలు ఒక ఉత్తరము వ్రాసింది. తనకు తన పెద్దవారు వేరొకరితో వివాహము నిశ్చయిస్తున్నారని, యీనాటి రాత్రి తనుయింటి పెరడులో నిరీక్షిస్తుంటానని , తప్పకుండా వచ్చి తనను తీసుకు వెళ్ళమని, ఒక వేళ నువ్వు గాని రాకపోతే తన యింటి నూతిలో శవము అయిపోతానని వ్రాసింది. ఆ ఉత్తరము అందుకున్న ప్రియుడు తన ప్రియురాలికి తనమీద ఉన్న ప్రేమను తలచుకొని పొంగిపోతూ ఆ ఉత్తరమును పలుమార్లు ముద్దు పెట్టుకొని నిశ్చింతగా నిద్రపొయాడు. ఆ రాత్రి ఆప్రియురాలు ప్రియుని గురించి నిరీక్షించి, నిరీక్షించి తెల్లవారేసరికి నూతిలో శవమై తేలింది. అటువంటి ప్రేమ లాంటి సాధన పనికి రాదు . పట్టుదల, కృషి ,వినయములు, నిరీక్షణ కావాలి.
సినిమాలు చూసి అందులో ఒక పాట పాడగానే మహత్తులు జరిగి కోరికలు తీరినట్టుగా నిజ జీవితములో కూడా నిముషాలు, గంటలలోనే అన్నీ జరిగిపోవాలని చాలామంది భావిస్తున్నారు. నమ్మకము, ఆశా భావముతో కృషి చేయాలి.
---- గురుదేవులు శ్రీ ఆంజనేయస్వామి దయతో మళ్ళీ మీ ముందుకు యీ సాధకుని జీవితములోని యింకొక విషయముతో వస్తాను.
---మాతృ దేవో భవ! పితృ దేవో భవ !! ఆచార్య దేవో భవ!!!

' శ్రీ మారుతీ పద భక్త ' కొమ్మూరు ఉమాప్రసాద్ భాగవతార్ .
.