.

గత 31 సంవత్సరములలో 300 లకు పైగా భక్తి గీతములను యిచ్చిన గురుదేవులు శ్రీ ఆంజనేయస్వామి. --ఒక సాధకుని ఆత్మ కధ-2

గురుదేవులు " శ్రీ ఆంజనేయస్వామి " యిచ్చిన తొలి కానుక సుందరదాసు గారి తెలుగు హనుమాన్ చాలీసా!
ఆ చాలీసాను పాడుతున్నప్పుడు అప్రయత్నముగానే నా కనులు మూయబడి ఏదో అవ్యక్త ఆనందము , తన్మయత్నము కలిగి ఒడలంతా జలదరించేది. శ్రీ M.S.రామారావు గారిది ఒక విలక్షణమైన శైలి. ఆ గొంతుకలోనున్న ఆర్తి అయస్కాంతములా ఆకర్షించి యెంతటి వాడినయనా కట్టిపడేస్తుంది. అటువంటి హనుమాన్ చాలీసా నేను పాడగలగడము నాకు యిప్పటికీ ఆశ్చర్యమే!
అది నేను పాడగా విన్నవారు కూడా తన్మయత్వముతో కదిలిపోయి సన్నిహితులకు చెప్పేవారు. ఆ విధముగా విపరీతముగా ప్రచారము అయి మా విశాఖపట్నములో యెక్కడెక్కడో జరిగే కార్యక్రమాలలో ప్రత్యేకముగా పాడించుకునేవారు. అంతటి అదృష్టము పొందగలిగినందుకు ఆ హనుమాన్ చాలీసాను నాకు మొదటి కానుకగా యిచ్చిన గురుదేవులు "శ్రీ ఆంజనేయస్వామికి" నేను దాసోహము అయిపోయాను.

స్వామి యిచ్చిన హనుమాన్ చాలీసా మాత్రమే పాడితే ఆయనకు తృప్తి ఉండదేమోనని భక్తి గీతాలు కొత్తవి నేర్చుకోవాలని ప్రయత్నము మొదలుపట్టాను. ఆ తపనతో ఆలయాలలో జరిగే భజన కార్యక్రమాలకు వెళ్ళేవాడిని. ఎక్కువగా సినిమా పాటల వరుసలలోనే భజనలు జరుగతున్నాయి. అవి పాడుతున్నప్పుడు ఆ సినీమా పాటలలోని భావాలే కలుగుతున్నాయి. అయితే ఆ పాడేవారిని తప్పు పట్టలేము. ఎందుచేతనంటే ప్రతీ వారము ఆలయాలలో భజనలు చేయాలన్న కోరిక వారికి ఉంది. సినిమా పాటలలోని రాగాలయితే వారు సులువుగా పాడగలరు. అంతకన్న వారికి మరో మార్గము లేదు. వారికి భక్తి గీతములు నేర్పేవారు లేరుమరి.

అయితే ఆ మార్గములో నేను వెళ్ళదలచుకోలేదు.
రేడియోలో వచ్చేపాటలు, టేపురికార్డులలోనిపాటలు, భజనలలో భక్తులు పాడే పాటలూ విని నాకు నచ్చినవి సాధన చేసుకునేవాడిని. కచేరీలలో పెద్ద పేద్దవారు పాడే పాటల జోలికి వెళ్ళే సాహసము నాకు లేదు. స్వయముగా శ్రీ ఆంజనేయస్వామే నాకు గురువు కాబట్టి అవిరామ కృషి, నిరంతర సాధన 1978 సంవత్సరములో ప్రారంభమైన ప్రయత్నము యీ రోజున అనగా 31 సంవత్సరములకు 300 ల వరకు భక్తి గీతాలు పాడగలిగే స్థాయికి తెచ్చింది.
మనిషి యేదైనా సాధించాలంటే అతనికి దైవ అనుగ్రహము, పెద్దల అనుగ్రహము, తల్లి తండ్రుల అనుగ్రహముతో పాటే తన అనుగ్రహము కూడా ఉండాలని భగవత్స్వరూపులు, ఉభయ వేదాంత ప్రవక్తకులు, ప్రవచన శిరోమణి, మహా మహోపాధ్యాయ అయిన 'శ్రీ మాన్ శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు ' చెప్పేవారు.
ఈ సంధర్భముగా ఒక కధ చెప్పుకోవాలి. ఒక ప్రియుడికి తన ప్రియురాలు ఒక ఉత్తరము వ్రాసింది. తనకు తన పెద్దవారు వేరొకరితో వివాహము నిశ్చయిస్తున్నారని, యీనాటి రాత్రి తనుయింటి పెరడులో నిరీక్షిస్తుంటానని , తప్పకుండా వచ్చి తనను తీసుకు వెళ్ళమని, ఒక వేళ నువ్వు గాని రాకపోతే తన యింటి నూతిలో శవము అయిపోతానని వ్రాసింది. ఆ ఉత్తరము అందుకున్న ప్రియుడు తన ప్రియురాలికి తనమీద ఉన్న ప్రేమను తలచుకొని పొంగిపోతూ ఆ ఉత్తరమును పలుమార్లు ముద్దు పెట్టుకొని నిశ్చింతగా నిద్రపొయాడు. ఆ రాత్రి ఆప్రియురాలు ప్రియుని గురించి నిరీక్షించి, నిరీక్షించి తెల్లవారేసరికి నూతిలో శవమై తేలింది. అటువంటి ప్రేమ లాంటి సాధన పనికి రాదు . పట్టుదల, కృషి ,వినయములు, నిరీక్షణ కావాలి.
సినిమాలు చూసి అందులో ఒక పాట పాడగానే మహత్తులు జరిగి కోరికలు తీరినట్టుగా నిజ జీవితములో కూడా నిముషాలు, గంటలలోనే అన్నీ జరిగిపోవాలని చాలామంది భావిస్తున్నారు. నమ్మకము, ఆశా భావముతో కృషి చేయాలి.
---- గురుదేవులు శ్రీ ఆంజనేయస్వామి దయతో మళ్ళీ మీ ముందుకు యీ సాధకుని జీవితములోని యింకొక విషయముతో వస్తాను.
---మాతృ దేవో భవ! పితృ దేవో భవ !! ఆచార్య దేవో భవ!!!

' శ్రీ మారుతీ పద భక్త ' కొమ్మూరు ఉమాప్రసాద్ భాగవతార్ .
.

1 కామెంట్‌లు:

durgeswara చెప్పారు...

dhanyajeevulu meeru

guruvugaariki ee daasuni pranaamaalu koodaa teliyajeyamdi

కామెంట్‌ను పోస్ట్ చేయండి