.

శ్రీ రామ నామ మహిమ[స్వామి శివానంద మహర్షి ,శ్రీ శివానంద ఆశ్రమము , ఋషీకేశ్ -తేది 08-08-1941]



భగవన్నామము ఆధ్యాత్మిక కల్పవృక్షము. అది మనో మాలిన్యముల విధ్వంసిని. అది పరమ శాంతిని , శాశ్వత ఆనందమును , అనంత జ్ఞానమును ప్రసాదించును. స్మరణ చేయువారి హృదయములో అది దివ్య ప్రేమను కురిపించును. అది సమస్త ఆనందములకు మూలము. అమృత ప్రసాదినియగు ఆ నామము మీ భయములన్నిటిని పోగొట్టి అందరకు ఉపశమనమును , పరమ సంతోషమును కలుగజేయుగాక!

శ్రీ రాముని నామము మధురతమమైన వస్తువులకంటే మధురమైనది. అది శాంతి ధామము. పవిత్ర ఆత్మల జీవనమే అది. అది ప్రపంచ వాసనలనెడు ప్రజ్వలితాగ్నులను చల్లార్చును. నీ హృదయములో నిహితమై యున్న దివ్యజ్ఞానమును అది మేల్కొలుపును. అది సాధకుని దివ్యానంద సాగరమున స్నానము చేయించును. శ్రీ రామునికి జయము! శ్రీ రామ నామమునకు జయము!!
ప్రతి వస్తువునందు ఒక్క రాముడు మాత్రమేఉన్నాడు. ఈ ప్రపంచమంతయు వారి లీల. రాముడు లేకుండా ప్రపంచమే లేదు. ఈ విశ్వమంతయు రామ మయము. రాముడు లేకుండా ప్రపంచమే లేదు. రాముడు , రామనామము వేరు కాదు.
శ్రీ రాముని చేరుటకు సాధన యేది యన వారి నామమును అనుసరించి అందులోనే లీనమగుటయే!
- ఏది వేద సాగరము నుండి మధింపబడినదో
- ఏది కలియుగమందలి దోషములను తొలగించునో
- ఏది సతతము పరమేశ్వరుని జిహ్వయందుండునో
- ఏది భవరోగములను పోగొట్టుతకు అమోఘమైన ఔషధమో
- ఏది జానకీ మాతకు ప్రాణము వంటిదో
అట్టి రామనామామృతమును నిరంతరము గ్రోలు పవిత్రాత్ముడు ధన్యుడగు గాక!

శాస్త్రములలో వర్ణింపబడిన పలు విధములైన జప మార్గములలో [ లిఖితి జపము ] మంత్రము వ్రాయుట శక్తితమమైనది. అది సాధకుని మనోధారణకు దోహదమును ఒసగి ధ్యానమునకు క్రమముగ గొంపోవును. నైతిక మార్గమున జిజ్ఞాసువుల ఆత్మ వికాసమునకు లిఖిత జపము చాల తోడ్పడును. మంత్రము వ్రాయునప్పుడు మనస్సు , జిహ్వ , చేతులు , కన్నులు మంత్రములో లీనమగుటచే పరధ్యానములు తగ్గి ధారణశక్తి పెంపొందును. మనో నిగ్రహము , శాశ్వత శుభ సంస్కారములు ,శాంతి , ఆత్మ శక్తి లభించును.

---- ఈ వ్యాసము యీ సాధకునిచే గురుదేవులు శ్రీ ఆంజనేయ స్వామి సంకలనము చేయించి 1989 మే నేలలో ముద్రింపించిన ఆధ్యాత్మిక దర్పణములోనిది.

జై మారుతీ ! జై జై మారుతీ !!
స్వామి రక్ష ! శ్రీ రామ రక్ష !!
శ్రీ రామ రక్ష ! సర్వ జగద్రక్ష !!

మాతృ దేవో భవ! పితృదేవో భవ!! ఆచార్య దేవోభవ!!!!

- అర్ధ సహస్ర సుందరకాండ కధాగాన శిరోమణి కొమ్మూరు ఉమాప్రసాద్ భాగవతార్
తేది 24-02-10


.

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి