.

అల్లూరి సీతారామరాజు గారి విశేషాలు.







అల్లూరి సీతారామరాజు గారు ఆంగ్లేయులచే చంపబడలేదా ?

ఆయన పోలికలతో ఉన్న యింకొకాయన చంపబడ్డారా ?

ఆయన బర్మా , రంగూనులో అజ్ఞాతవాసములో 14 సంవత్సరాలు గడిపి వచ్చి ఆశ్రమము స్థాపించి సాధుజీవనము గడుపుతూ 8 మంది భార్యలను వివాహము చేసుకున్నారా ?

ఆశ్రమములో ఉన్న అల్లూరి సీతారామరాజు గారిని కలవడానికి ఆయన తల్లి గారు , మల్లుదొర తరచుగా వచ్చేవారా ?

ఈ మధ్య 2 tv chaannels వారు అల్లూరి సీతారామరాజు గారి గురించి పైన చెప్పబడిన విషయాలను ప్రసారము చేశారు. వారు చెప్పిన విషయాలు యేమిటంటే .......

అల్లూరి సీతారామరాజు మన్యసీమలో సుమారు 500 మందితో ఆంగ్లేయలను ఎదిరించడానికి ధర్మయుద్ధము చేసారు . అపారమైన ఆంగ్లేయుల సేనతో తలపడలేక , తనకోసము ఆంగ్లేయులు మన్యసీమలోనివారిని చిత్రహింసలు చేస్తుంటే 1923 మే నెల 23 వ తారీఖున లొంగిపోతున్నట్టుగా కబురు పంపారు. 1924 లో 'రూధర్ ఫర్డ్ ' ఆధ్వర్యములో లొంగిపోయిన సీతారామరాజును చెట్టుకు కట్టి ' గుడాల్ 'అనే అతను తుపాకితో కాల్చి చంపారు. మరణించినప్పుడు సీతారామరాజు వయస్సు 27 సంవత్సరాలు.

ఇంతవరకు ఆ చానల్సు వారు చెప్పింది బాగానే వుంది. ఆ తరువాత విషయాలు వింతగా వున్నాయి.

అల్లూరి సీతారామరాజు మరణించలేదనీ , మరణించినది ఆయన పోలికలు ఉన్న 'వీర వెంకటాచారి ' అనీ , సీతారామరాజుకు కుడి కణతమీద పుట్టుమచ్చ ఉందనీ , సీతారామరాజు చనిపోయినట్టుగా ప్రభుత్వము ప్రకటించిన శవముపై ఆ పుట్టుమచ్చలేదనీ అన్నారు. ఆయన ఖాకీ నిక్కరు, తెల్ల జుబ్బా ధరించేవారనీ చెప్పారు .

ఆ సంఘటన తరువాత సీతారామరాజు బర్మా ,రంగూనులో 14 సంవత్సరాలు అరణ్యవాసము చేసి 1941 లో బెండపూడి గ్రామమునకు వచ్చి ఆశ్రమము స్థాపించి ' బెండపూడి సాధువు ' గా పిలువబడుచూ 20 సంవత్సరాలు ఉన్నారని , ఆశ్రమములో నిత్యాన్నదానము జరిగేదనీ చెప్పారు.

బెండపూడి సాధువు 8 మంది క్షత్రియ కన్యలను వివాహమాడినట్టుగా చెప్పారు.

బెండపూడి సాధువును చూడడానికి అల్లూరి సీతారామరాజు తల్లి , మల్లు దొర , లక్ష్మన్నదొర తరచుగా వచ్చేవారని చెప్పారు.

అల్లూరి సీతారామరాజు తమ్ముడి కొడుకు ' రామరాజు ' ఫోనులో మాట్లాడుతూ , తనకు పెద్ద నాన్నగారి పేరే పెట్టారని చెప్పారు. సీతారామరాజు గారు వివాహము చేసుకోను అని అనేవారని , తపస్సు చేసుకోవడానికి అడవికి వెళ్ళేరని , అక్కడివారి బాధలను చూడలేక ధర్మ యుద్దము చేశారని చెప్పారు.

బెండపూడి సాధువు కోడలు ' వరలక్ష్మి ' మాట్లాడుచూ బెండపూడి సాధువు 'సీతారామరాజే 'అని యెప్పుడూ యెవ్వరితోను చెప్పలేదని అన్నారు.

అల్లూరి సీతారామరాజు చరిత్ర సినిమా తీస్తామని పెద్దలు అడిగితే , అసలే ఆయన నిజ జీవితానికీ , లోకములో ప్రచారమవుతున్న విషయాలకు యెక్కడా పొంతన లేదనీ , సినిమా తీయడానికి యిచ్చినా నిజమైన చరిత్ర తీయరనీ , అందుచేత ఆయన నిజ చరిత్ర యివ్వనని మల్లన్నదొర వ్రాసిన ఉత్తరము చూపించారు.

ఇవీ ఆ చానల్సు వారు ప్రసారము చేసిన విషయాలు.

అయితే ఈ సాధకుడు 1985 లో ' క్రిష్ణ దేవి పేట ' వెళ్ళడము సంభవించింది. ' శ్రీ మోపిదేవి క్రిష్ణ స్వామి ' గారు ఆధ్యాత్మిక ప్రవచనాలు చేస్తుంటారు . వారు ఒకసారి యీ సాధకునిచే సంకీర్తన కార్యక్రమము పెట్టించుకున్నారు. వారు క్రిష్ణదేవిపేటలో 7 దినములు ఉపన్యాసములు యివ్వడానికి వెళ్తూ మా బృందానికి గూడా ఆహ్వానము పంపించారు. క్రిష్ణదేవిపేట వాస్తవ్యులు , ఆ కార్యక్రమ నిర్వాహకులు , శ్రీ దరిశి సత్యనారాయణగారు మమ్మల్ని స్వయముగా ఆహ్వానించారు. అక్కడ మా కార్యక్రము జరుగుతుండగా ఆయన మా వూరి ప్రత్యేకత చూపిస్తానని ఆ వూరి చివరకు [అడవికి వెళ్ళే దారికి] తీసుకువెళ్ళారు. నేలలోనే పీఠము ఉన్న ఒక శివలింగము చూపించి ' అల్లూరి సీతారామరాజు గారి తల్లి యిక్కడకు వచ్చేవారు. ఆవిడను కలవడానికి సీతారామరాజుగారు పులిమీద వచ్చేవారు. పులి పాలతో యీ శివలింగానికి అభిషేకము చేసేవారు.తల్లితో మాట్లాడి ఆవిడ తెచ్చినవి తిని వెళ్ళిపోయేవారు ' అని చెప్పారు.

ఒక్కసారిగా ఒళ్ళంతా జలదరించింది ! సీతారామరాజు పేరు వింటేనే తనువు పులకరిస్తుంది ! అటువంటిది ఆయన తిరిగిన ప్రదేశాలలో తిరగడమే కాకుండా ఆయన పులి పాలతో అభిషేకము చేసిన శివలింగమును తాకే అదృష్టము పొందిన యీ సాధకునికి కళ్ళంట నీళ్ళు వచ్చాయి. అయితే యింత చరిత్ర కలిగిన ఆశివలింగము ఆలనా - పాలనా చూసే దిక్కు లేక ,ఆచ్చాదన లేక శివలింగము బరువుకి నేలలో కూరుకుపోతున్నాది. బరువెక్కిన గుండెలతో తిరిగి వస్తున్నాము.


త్రోవలో ఒక దగ్గర ఆగి, ' ఆనాడు అడవిలో సీతారామరాజు గారిని కాల్చి చంపి , తిరగవేసిన నులక మంచము మీద ఆయన భౌతిక దేహాన్ని తీసుకువచ్చి యిక్కడ దించారు. ఆ సమయములో అక్కడ చేరినవారిని అందరినీ , ఇతనేనా సీతారామరాజు ? అని అడిగారు. చుట్టూ చేరినవారు యెవ్వరూ మాట్లాడలేదు. విగత జీవుడై మంచము మీద పడివున్న తమ ప్రియతమ నాయకుడిని చూస్తూ నిశ్చేష్టులయిపోయారు. యెవరిని అడిగినా మాట్లాడకపోవడముతో ఆయనను తీసుకువచ్చినవాళ్ళు ఆయనను కాళ్ళతో తన్నారు. అంతే అది చూసి తట్టుకోలేక గొల్లున రోదిస్తూ అందరూ ఆయన పాదాలమీద పడిపోయారు. అప్పుడు అతనే సీతారామరాజు అని వాళ్ళు నిర్ధారణ చేసుకున్నారు 'అని చెప్పారు.

ఆయన అడవిలో తపస్సు చేసుకునేవారని, కోయ దొరలతో సఖ్యముగా వుండేవారని , వారి పరిస్తితిని చూసి ఉత్తేజితులై ధర్మయుధ్ధానికి పూనుకున్నారని చెప్పారు. ఆయనకు శక్తులు ఉన్నాయని , అప్పుడప్పుడు మల్లుదొర, గంటందొర మొదలైన వారితో అడవిలో వెళ్తుండగా హఠాత్తుగా ఉత్తరదిక్కువైపు తిరిగి యెవరో చెప్పుతున్నది వినేవారని , యేమిటి దొరా అలాగ ఆగిపోయారు ? ఆకాశములోనికి చూస్తూ యెవరితో మాట్లాడుతున్నారు? అని అడిగితే కలకత్తా నుండి 'అరవింద ఘోష్ గారు ' మాట్లాడేరని 10 దినములలో ముఖ్యమైన సమావేశము ఉన్నాదనీ దానికి తప్పకుండా రావాలని చెప్పేరని , ఉత్తరము కూడా వ్రాసేరట అది వస్తుంది అని చెప్పారుట. ఆ విధముగానే ఉత్తరము వచ్చేదట . ఆయన ముఖము తేజస్సుతో ఉండేదట.

ఈ సాధకడు చిన్నప్పటినుండి యెన్నోసార్లు యెంతోమంది కళాకారులు అల్లూరి సీతారామరాజు ఏక పాత్రాభినయనము చేయగా చూసాడు. అదంతా నిజముగా జరుగలేదు. యెవరో మహానుభావుడిచేత సృష్టించబడింది. క్రిష్ణదేవిపేట [k.d.peta] లోనున్న సామాన్యులకు తెలిసిన నిజాలను అనేక రసాలతో కూర్చిన ఆ కల్పిత గాధ మరుగుపరచింది.


ఆయన మరణించలేదని యెక్కడో అజ్ఞాతవాసము చేసి వచ్చి బెండపూడి లో సాధువుగా అవతారము యెత్తి 8 మంది క్షత్రియ కన్యలను వివాహము చేసుకున్నారని యెవరు చెప్పినా సగటు భారతీయుడు అంగీకరించడు.


జై మారుతీ! జై మారుతీ !!






.

2 కామెంట్‌లు:

Kodavanti Subrahmanyam చెప్పారు...

నేను కూడా లోగడ ఈ విషయము విన్నాను. ఇంత విపులంగా కాదు. ఒక విషయము సంతోషాన్ని కలుగ చేస్తోంది. అది ఏమంటే అల్లూరి సీతారామ రాజు ఆంగ్లేయుల చేతిలో చనిపోలేదన్నది. మీ వ్యాసాలు చాలాఆహ్లాద కరంగా మనోరంజకంగా వున్నాయి. ఉంటున్నాయి. చాల సంతోషమండి శ్రీ ఉమాప్రసాద్ గారు
కొడవంటి సుబ్రహ్మణ్యం

Umaprasad Bhagavatar చెప్పారు...

సుబ్రహ్మణ్యం గారికి నమస్కారము !
ఆయన ఆంగ్లేయుల చేతిలో చనిపోలేదని , బెండపూడి సాధువుగా మారువేషములో వుండేవారని కొంతమంది విశ్వాసము. ఈ సాధకుడు చెప్పిన విషయము యేమిటంటే .. ఆయన ఆంగ్లేయుల చేతిలో చనిపోయారు కాని ఆయన యెవరో తెలియకుండానే చంపి క్రిష్ణదేవి పెటలో ఆయననే చంపినట్టుగా నిర్ధారణ చేసుకున్నారని. ఏకపాత్రాభినయములలోను , సినిమాలోను చూపినట్టుగా ఆయనను చంపినప్పుడు ఆంగ్లేయులతో వాగ్వాదము జరగలేదని, ఆ సంభాషణలు యెవరో కల్పించారని. ఈ సాధకుని వ్యాసములు చదువుతున్నందుకు కృతజ్ఞతలు. ----ఉమా ప్రసాద్ .

కామెంట్‌ను పోస్ట్ చేయండి