.

దేముడి నుండి మనకు వచ్చే మూడు ఉత్తరాలు

దేముడినుండి మనకు వచ్చే మూడు ఉత్తరాలు.
సుబ్బారావు అనే అతను ఉద్యోగరీత్యా విశాఖపట్నము వచ్చాడు. అతనికి సాయంకాలముపూట బీచి[సముద్రపు ఒడ్డు]లో కూర్చొని విశ్రాంతి లేకుండా నిర్విరామముగా ఉవ్వెత్తునవచ్చి వెనక్కుపోయే కెరటాలనుచూస్తూ కూర్చోవడము చాలా సరదా! రోజులు,నెలలు,సంవత్సరాలు గడుస్తున్నా అతను ఆ అలవాటు మానుకోలేదు సరికదా- చీకటి పడిపోయినా ,చుట్టుప్రక్కల ఎవరూ లేకపోయినా వంటరిగానే సముద్రపు ఆ చివరిని చూస్తూ కాలము గడిపేవాడు.
ఒక రోజు సాయంత్రము చీకటి పడిపోయినా అలవాటు ప్రకారము కూర్చుండిపోయాడు. చుట్టూ యెవ్వరూ లేరు. కెరటాల హోరును శ్రవణానందముగా వింటూ ఉవ్న్నాడు. హఠాత్తుగా సముద్రముమీద చాలా దూరమునుండి యేదో ఆకారము అస్పష్టముగా రావడము కనిపించింది. ఆ ఆకారము అతనివైపునే వస్తున్నాది. ఏదో పడవేమో అనుకున్నాడు. కాని ఆ ఆకారము దగ్గరకు వచ్చేసరికి యెనుబోతుమీద కిరీటముతో చేతిలో పాశముతో ఆ వస్తున్నది 'యమధర్మరాజు ' అని అర్ధమయింది. నోటమాటరాక వళ్ళంతా చెమటలు పట్టి గుండె కొట్టుకుంటున్న శబ్ధముతప్ప సముద్రపు హోరు వినిపించడము లేదు. భయంభయంగా చూస్తున్న అతనిముందు నుండే 'యమధర్మరాజు ' వెళ్ళిపోతున్నారు. సుబ్బారావుకి ప్రాణము లేచి వచ్చింది. కొద్దిగా ధైర్యము తెచ్చుకొని, ' యమధర్మరాజు గారూ! ఆగండి! ' అని పిలిచాడు. యమధర్మరాజు గారు ఆశ్చర్యముతో వెనుకకు తిరిగి చూసి యీ మానవులు పౌరాణిక నాటకములు చలన చిత్రములు చూసి మనలను పోల్చుకుంటున్నారు అనుకొని ఆగారు.సుబ్బారావు నెమ్మదిగా ఆయన దగ్గరకు వెళ్ళి మీరు దేముడే కదా! మరి నాకు కనిపించి కూడా వరము యివ్వకుండా వెళ్ళిపోవడము ధర్మమా? ధర్మరాజా! ' అని అడిగాడు. ధర్మరాజు నవ్వుకుంటూ," సరే! నీకు యేమి వరము కావాలి?" అని అడిగారు. సుబ్బారావు సంతోషముతో,'మీరు నా గురించి వచ్చినప్పుడు నాకు తెలియజేసి రావాలండీ!' అని అడిగాడు. " సరే! నీకు మూడు ఉత్తరాలు పంపి వస్తానులే! అని ఆయన వెళ్ళిపోయారు. 'తన మృత్యువు తనకు ముందే తెలుస్తున్నాదని సంతోషముతో సుబ్బారావు పొంగిపోయాడు.
రోజులు, నెలలు, సంవత్సరాలుగడుస్తున్నాయి. సుబ్బారావు బీచికి వెళ్ళడము మానలేదు. ఈలోగా అతనికి వివాహము అయింది. పిల్లలు పుట్టి, చదువుకుంటూ, పెద్దవారు అయి, వివాహములు అయి స్థిరపడ్డారు. ఈయనకు ఉద్యోగములో ప్రమోషనులు వరుసగా వచ్చాయి. స్వంత యిల్లు కట్టుకున్నాడు.ఉద్యోగమునుండి రిటైర్ అయ్యాడు.అయినా బీచికి వెళ్తూనే వున్నాడు.
ఒక రోజు సాయంత్రము బాగా చీకటి పడిపోయింది. యమధర్మరాజు వచ్చి యెదురుగా నిలబడ్డారు. సుబ్బారావు ఆయనకు నమస్కరించి,'స్వామీ! యీ రోజు పాపం యెవరికి మూడింది? 'అని అడిగాడు. "ఇంకెవరికి? నీకే! "అని యమధర్మరాజు అన్నారు! 'అదేమిటి స్వామీ! మూడు ఉత్తరాలు పంపిన తరువాత వస్తానని చెప్పి యిప్పుడు హఠాత్తుగా రావడము మీకు ధర్మమా?' అని సుబ్బారావు దూఃఖముతో అడిగాడు. ధర్మరాజు "నాయనా! నీకు జుత్తు నెరిసిందా? ' అని అడగగానే సుబ్బారావు, ' నెరిసిందండీ! కాని యిదుగో రంగు వేసుకున్నాను ' అన్నాడు. " సరే! నీకు చూపు తగ్గిందా? "అని ఆయన అడగగానే ,'తగ్గిందండీ! కళ్ళద్దాలు పెట్టుకున్నానండీ!'అని యీయన జవాబు యిచ్చాడు. "సరే! నీకు దంతాలు కదిలాయా?" అని ఆయన అడగగానే యీయన, 'కదలదమేమిటి! చాలా ఊడిపోతే పళ్ళు కట్టించుకున్నానండీ! ' అని యీయన చెప్పాడు. యమధర్మరాజు గారు తాపీగా," అవే నాయనా! మేము నీకు పంపిన మూడు ఉత్తరాలు. మా లోకము పద్దతి ప్రకారము ఉత్తరాలు అలానే పంపుతాము"అని సుబ్బారావు ప్రాణాలను తీసుకు పోయారు.
ఈ కథ - పూజ్యులు దైవ స్వరూపులు శ్రీ శ్రీ శ్రీ శ్రీరంగ రంగరాజ జియ్యరు స్వామివారు సుమారు 16 సంవత్సరముల క్రిందట విశాఖలో చెప్పినారు. మొదటి ఉత్తరము రాగానే బాహ్య దృష్తిని తగ్గించుకొని భగవత్పరముగా జీవితమును గడిపి భగవంతుని అనుగ్రహపాత్రులు అవ్వాలని వారు మంగళాశాశనములు చేశారు.
సర్వే జనా సుఖినోభవంతు! అంతర్జాల మితృలందరికీ నమస్కారములతో
--- శ్రీ మారుతీ పద భక్త కొమ్మూరు ఉమాప్రసాద్ భాగవతార్
.

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి