మనము భగవంతునికి చేసే పూజలు , నోములు , వ్రతములు , జపములు , తపములు ఫలించి జీవన్ముక్తిని పొందుటకు ద్వాదశాబ్దము లేక పుష్కర కాలము పట్టును. అనగా 12 సంవత్సరముల నిరంతర సాధన మనకు ముక్తిని ఇప్పించును.
అయితే 12 సంవత్సరముల కాలము నిర్ణయించబడేది , లెక్కించబడేది మన కొలమానముతో కాదు. భగవంతుని వద్ద ఉన్న మన ఆధ్యాత్మిక జీవన చిట్టాలో యీ కాలము లెక్కించబడును.
ఒక దినములో ఉన్న 24గంటలలో యెన్ని నిముషములు మనము ధ్యానములో లయమునొంది ఉందుమో అన్ని నిముషములే భగవంతుని వద్ద నున్న మన చిట్టాలో చేర్చబడును. అటువంటి 60 నిముషములు కలిసి ఒక గంట అగును. అలాంటి 24గంటలు ఎప్పుడు పూర్తి అగునో అప్పటికి (మనము అనుష్టానములో ప్రవేశించి ఎన్ని సంవత్సరములు అయిననూ) భగవంతుని వద్ద ఉన్న మన ఆధ్యాత్మిక జీవన చిట్టాలో ఒక దినము మాత్రమే అగును. అటువంటి 30 దినములు ఒక నెల అగును. అటువంటి 12 నెలలు చేరినప్పుడు ఒక సంవత్సరము ఆగును. ఆ విధముగా 12 సంవత్సరములు పూర్తీయినప్పుడు మనకు జీవన్ముక్తి కలుగును.
ఎంత తీవ్ర నిష్ఠతో శ్రద్ధ కలిగి అనుష్ఠించినవాడైననూ ఒక జన్మములో ఆ 12 సంవత్సరములు పూర్తిచేయజాలడు. అందుకు భగవంతుడు తనను చేరుకోడానికి 7 జన్మలను మనకు ప్రసాదించాడు. ఆ 7 జన్మలలో మనది ఇప్పుడు ఎన్నో జన్మమో !
భగవంతుడు సృష్టించిన కోట్లాది జీవరాసులలో మానవ జన్మ ఉత్కృష్ఠమైనది , దుర్లభమైనది. మానవ జన్మ పొందిన మనకు మన జన్మ విలువ తెలియదు. మనకు తెలియనంతమాత్రాన దాని గొప్పదనము పోదు.
పుణ్యకార్యములు చేసి స్వర్గమునకు వెళ్ళి దేవతలు అయినవారు ఆ పుణ్య ఫలము అయిపోగానే జన్మ రాహిత్యాన్ని , జీవన్ముక్తిని , మోక్షమును పొందాలంటే మళ్ళీ మానవ వారు మళ్ళీ మనవ జన్మనెత్తి ప్రయత్నించుకోవలసినదే ! అంత గొప్ప జన్మ యీ మానవ జన్మ !
ఒక దినములో యెక్కువ కాలము నిద్రలోనూ , కాలకృత్యములలోనూ , నైతిక బాధ్యతల నిర్వహణలలోనూ , తక్కిన కాలము వృధాగానూ మనము గడుపుతున్నాము. కనుక 12 సంవత్సరముల కాలమును త్వరగా పూర్తిచేసుకునే ప్రయత్నము కనీసము యిప్పటినుండయినా ప్రారంభిస్తే యీ జీవితానికి సార్ధకత ఉంటుంది!
జై మారుతీ ! జై జై మారుతీ !!
635 వ సుందరకాండ కధాగాన కార్యక్రమము.
తూర్పు గోదావరి జిల్లాలో , అనపర్తి మండలములో , పొలమూరు గ్రామములో తేదీ 20-04-2010 మంగళవారము నుండి తేదీ 27-04-2010 27-04-2010 మంగళవారము వరకు 8 దినములు ప్రతీ రోజు సాయంత్రము 6.30 గంటలనుండి 8.30 గంటల వరకు గురుదేవులు శ్రీ ఆంజనేయస్వామి వారి దయతో 635 వ సుందరకాండ కధాగానము జరుగును. ఈ కార్యక్రమము సందర్భముగా సామూహిక శ్రీ రామ కోటి లిఖిత యజ్ఞము జరుగును.
అందరూ ఆహ్వానితులే !
.