M.S.రామారావు గారి ఆశీస్సులు అందుకున్న తరువాత వారు యిచ్చిన సుందరకాండ పుస్తకమును భద్రముగా దేముడి పుస్తకాలలో పెట్టి కొన్నాళ్ళకు ఆ పుస్తకము సంగతే మర్చిపోయాను.
అంతవరకు అఫీసులోను , బయటా , యూనియను కార్యక్రమాలలోను , సాంస్కృతిక కార్యక్రమాలలోను , క్రీడా కార్యక్రమాలలోను, నాటకాలలోను ఉధృతముగా పాల్గొంటున్న నన్ను " గురుదేవులు శ్రీ ఆంజనేయస్వామి " భక్తి మార్గములోనికి మార్చారు. కాని భక్తి అంటే పర్వదినములలో అందరితో పాటే అప్పుడప్పుడు పూజా కార్యక్రమములలో పాల్గొనడమే తెలుసు . " శ్రీ ఆంజనేయస్వామి" ప్రభావము వలన కొత్త కొత్త పాటలు పాడుకోవాలనీ ,దేముడికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలని తపన ప్రారంభమయ్యింది. ఎక్కడెక్కడ దైవకార్యాలు జరుగుతున్నా అక్కడకు వెళ్ళి నిశితముగా పరిశీలించడము , పెద్ద పెద్దవారి ఉపన్యాసములను వింటూ అందులో ముఖ్యమయిన విషయములను సూక్ష్మముగా వ్రాసుకొని యింటికి వచ్చిన తరువాత దానిని విపులముగా వ్రాసి ఉంచుకోవడము మొదలయింది. పత్రికలలో దైవమునకు సంబంధించిన విషయములను కత్తిరించుకొని దాచుకోవడము , కత్తిరించడానికి వీలు లేకపోతే వ్రాసుకొని ఉంచుకోవడము ప్రారంభమయ్యింది.
తెలుగు హనుమాన్ చాలీసా గానము అందరికీ నచ్చడమువలన యెవరయినా పిలిస్తే తప్పకుండా వెళ్ళేవాడిని. ఖుర్దా రోడ్డు [ ఒరిస్సా ] నుండి శ్రీ A.CH. సోమయాజులు గారు మలేరియా యిన్స్పెక్టరుగా పదవీ విరమణ చేసి వచ్చారు. ఆయనను 'అపర కబీరు ' అంటారు. వారివద్దకు కొన్నాళ్ళు వెళ్ళాను.
ఆ తరువాత పోర్టు శ్రీ రామాలయము మాష్టారు పిలిస్తే అక్కడకు వెళ్ళేవాడిని. అక్కడే 'తులసీదాసు' హిందీ హనుమాన్ చాలీసా నేర్చుకున్నాను. ఏక ధాటిగా 108 పర్యాయములు సునాయాసముగా పాడడము వచ్చింది.
ఆ రామాలయములలో కొందరు కూర్చొని శ్రీ రామ నామములను వ్రాస్తుంటే చూసి శ్రీ రామ నామములుఒక కోటి సేకరించాలనే సంకల్పము వచ్చింది. ఒక మనిషి తన జీవితములో నిద్రకు , కాలకృత్యములకు సమయము వదలి తక్కిన సమయమంతా శ్రీ రామనామములు వ్రాస్తే ఒక కొటి శ్రీ రామనామములు వ్రాయడానికి ౧౮ సంవత్సరములు పడుతుందని పెద్దలు చెప్పారు. అందుచేత అందరము కలసి కోటి శ్రీ రామనామములు వ్రాద్దామని అందరితో చెప్పాను. విశాఖపట్నము పోర్టులో పనిచేస్తుండడము వలన వందలాదిమందితో సాన్నిహిత్యము ఉంది. శ్రీ రామనామములు వ్రాసే పుస్తకములను కొని ఆసక్తి గలవారికి యిచ్చాను.వారందరినీ వాటిని యిళ్ళకు తీసుకొని వెళ్ళి పుస్తకములోని పేజీలను విడదీసి కుటుంభ సభ్యులంతా వ్రాయండి అనిచెప్పాను.
ఆ విధముగా జనవరి 1986 లో " సామూహిక శ్రీ రామకోటి లిఖిత యజ్ఞము " ప్రారంభమయ్యింది. గురుదేవులు శ్రీ ఆంజనేయస్వామి దయవలన ఆ సంకల్పము రావడము వలన ఆశ్చర్యముగా , విచిత్రముగా కేవలము 3 నెలలలోనే " ఒక కోటి శ్రీ రామ నామములు " సేకరించబడ్డాయి. అందరూ చాలా అశ్చర్యపడ్డారు. శ్రీ రామనామములు వ్రాసి యిచ్చిన భక్తులకయితే వారి ఆనందానికి అవధులు లేవు. నేను ఉబ్బితబ్బిబ్బయిపోయాను. నాకు నెమ్మదిగా "స్వామి" ప్రభావము అవగతమవుతున్నాది. వరుసగా జరుగుతున్న సంఘటనలు కాకతాళీయముగా జరుగుతున్నవి కావని, వీటిని తేలికగా తీసుకోకూడదని అనుకున్నాను. నెమ్మదిగా తక్కిన కార్యక్రమాలు తగ్గించుకోవడము మొదలుపెట్టాను.
శ్రీ రామకోటి పూర్తి అయినందుకు వాటికి పూజాకార్యక్రమము చేయించాలనుకొని పోర్టు శ్రీ రామాలయము మాష్టారు వద్దకు వెళ్ళి శ్రీ రామ నామములకు పూజ చేయమని కోరేను. ఆయన చెప్పిన జవాబు నన్ను నిశ్చేష్ఠునిగా చేసింది. ఆయన చాలా స్థిరముగా చెప్పారు.' మీకు సంకీర్తన చేయడము వరకే వీలు ఉంది. శ్రీ రామనామములు వ్రాయించడము, వాటికి పూజా కార్యక్రమములు చేయించడము అవకాశము లేదు. ఆ పూజ యిక్కడ చేయబడదు ' అని చెప్పారు. ' మీకు ' రోడ్డుమీద పంతులు ' యెవరయినా దొరుకుతారు వా ళ్ళచేత చేయించుకోమని చెప్పారు. సరేనని వచ్చేస్తుంటే ఆగండి కొంతసేపు సంకీర్తన చేద్దామని అన్నారు. కాసేపు సంకీర్తన చేసి యింటికి వచ్చేశాను.
ఇంక సంకీర్తనకు పోర్టు రామాలయమునకు వెళ్ళే అవకాశము లేదని అనుకున్నాను. దైవ కార్యక్రములకు అవకాశము లేని దగ్గరకు వెళ్ళడము " స్వామికి' యిష్టము వుండదనుకున్నాను. తరచుగా వెళ్ళడము మానివేశాను. మరి కోటి శ్రీ రామనామములకు పూజ చేయించే భారము నీదేనని స్వామికి విన్నవించుకున్నాను.
జై మారుతీ! జై జై మారుతీ!!
స్వామి రక్ష ! శ్రీ రామ రక్ష !!
శ్రీ రామ రక్ష ! సర్వ జగద్రక్ష !!
మాతృదేవోభవ ! పితృదేవోభవ !! ఆచార్యదేవోభవ !!!
రామాలయము మాష్టారు నాతో అన్న విషయములు యిలా పైకి తెలియజేయడము సభ్యత కాదు గాని యీ సాధకుడు యెటువంటి ఒడుదుడుకులు యెదుర్కున్నాడో తెలియజేయడమే నా ఉద్దేశ్యము.
.
1 కామెంట్‌లు:
కొండ్లెత్తిన స్వామికి కోదండరాముని నామం వ్రాపించటం బహుప్రీతికదా మీ భక్తి ఆయన శక్తి ఇలా అద్భుతాలను సృష్టించాయి .ధన్యవాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి