'సుందరదాసు M.S.రామారావు ' గారిచే యీ సాధకునకు తేది 11-09-78న వారి సుందరకాండ పుస్తకమును లిఖితపూర్వక ఆశీస్సులతో యిప్పించిన " గురుదేవులు శ్రీ ఆంజనేయస్వామి! "
[ ఒక సాధకుని ఆత్మ కధ ---3
1978 సంవత్సరము జూలై నెలలో మాదంపతులను ఘోరమయిన ప్రమాదము నుండి కాపాడిన గురు దేవులు "శ్రీ ఆంజనేయస్వామి " 1978 సంవత్సరము ఆగష్టు నెలలో " తన అనుగ్రహపాతృలయిన సుందర దాసు M.S రామారావుగారు రచించి గానము చేస్తున్న శ్రీ హనుమాన్ చాలీసాను రేడియో ద్వారా యీ సాధకునికి యిచ్చిన విషయము తేది 05-03-10 న మీకు తెలియజేశాను .
సెప్టెంబరు నెలలో అనగా నెలలోనే 'స్వామి ' ఈ సాధకునకు వెల కట్టలేని కానుక యిచ్చారు. తేది 11-09-1978 నాడు కొందరు సన్నిహితులు వచ్చి శ్రీ సంపత్ వినాయక స్వామి వారి ఆలయములో [విశాఖలోనే] శ్రీ M.S.రామారావుగారు 7 రోజులు సుందరకాండ కధాగానము చేస్తున్నారు, వెళ్దాము రండి అని యీ సాధకుడిని తీసుకొని వెళ్ళారు. వారిని స్వయముగా చూసే అవకాశము లభించినందుకు యెంతో ఆనందముతో వెళ్ళాను. కార్యక్రమము యింకా మొదలు అవలేదు. M S రామారావు గారు అప్పుడే వచ్చారు. నన్ను తీసుకొని వెళ్ళిన పెద్దలు నన్ను వారికి పరిచయము చేశారు 'అయ్యా! ఈయన మీరు గానము చేసిన తెలుగు హనుమాన్ చాలీసాను పాడుతున్నారు ' అని . నేను వినయముగా నమస్కరించాను. ఆయన ' బాబూ ! యేది కొద్దిగా పాడండీ ' అన్నారు. ఆంజనేయ స్వామి అంతటి వారి ముందు నేను కుప్పిగంతులు వేయడమా అనుకుంటూ నెమ్మదిగా మొదటి రెండు ప్రార్ధన శ్లోకాలు పాడాను. వింటూనే ఆయన యేదో పుస్తకము తీసి లోపలి పేజీలో యేదో వ్రాసి సంతకము చేసి 'బావుంది ప్రచారము చేయు నాయనా!' అంటూ ఆ పుస్తకమును నాకు యిచ్చారు. నా ఆనందానికి అవధులు లేవు. కేవలము నా తృప్తికోసము ,నా ఆనందము కోసము పాడుకుంటున్నాను. అటువంటిది ఆయన స్వయంగా ఆ విధముగా అనడము ,యేదో పుస్తకము యివ్వడము నాకు నోటంట మాటలు రాలేదు. ఇంటికి తిరిగి వచ్చిన తరువాత చూసేసరికి ఆ పుస్తకము వారు రచించి గానము చేస్తున్న 'సుందరకాండ!'. అది యిచ్చి ప్రచారము చేయు నాయనా అన్నారు. అప్పటి నా స్థాయికి తెలుగు శ్రీ హనుమాన్ చాలీసా గానమే యెక్కువ! అందు చేత శ్రీ హనుమాన్ చాలీసా గానమునే ప్రచారము చేయమన్నారన్న నిశ్చయమైన అభిప్రాయముతో ఆ పుస్తకమును జాగ్రత్తగా దాచుకున్నాను.
జై మారుతి ! జై జై మారుతి !!
స్వామి రక్ష ! శ్రీ రామ రక్ష !!
శ్రీ రామ రక్ష ! సర్వ జగద్రక్ష !!
అర్ధ సహస్ర సుందరకాండ కథా గాన శిరోమణి - కొమ్మూరు ఉమాప్రసాద్ భాగవతార్
.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి