.

మొదటి శ్రీ రామకోటి నామములకు ఊహాతీతముగా, అద్భుతముగా పూజ జరిపించిన గురుదేవులు శ్రీ ఆంజనేయస్వామి. --- ఒక సాధకుని ఆత్మకధ -5.




శ్రీ రామనామములు వ్రాసిన వారిలో ఒకరయిన భీమనాధం త్రినాధరావుగారు [ యీ సాధకునికి బావగారు ] ఒక రోజు వచ్చి, మూడు నెలలలో అందరిచేత కోటి శ్రీరామనామములను మీరు వ్రాయించారని శ్రీభాష్యం అప్పలాచారిస్వామివారికి నేను తెలియజేశాను . అది వినగానే స్వామివారు ఆయనను నేను చూడాలి వెంటనే తీసుకొని రండి అన్నారు , పదండి వెళదాము అన్నారు.

ఆ స్వామివారి గురించి నాకు అస్సలు తెలియదు కాని బావగారు రమ్మంటున్నారు కాబట్టి బయలుదేరాము. తోవలో మా బావగారు వారి గురించి చెప్పారు. వారు గురువులకే గురువులు అనీ , వారు రామాయణము చెప్పుతుంటే యెవ్వరూ కదలరనీ , కోటీశ్వరులు కూడా వారి దర్శనము కోసము ఆతృతగా వుంటారనీ ,వారు మిమ్మల్ని చూస్తాను అనడమే చాలా గొప్ప విషయమనీ చెప్పేసరికి నాకు కొద్దిగా భయము వేసింది. అంతటి మహానుభావుల వద్ద యెలా ప్రవర్తించాలో తెలియదు.ఏదైనా పొరపాటు చేస్తానేమో గురుదేవా! ఆంజనేయస్వామీ నువ్వే కాపాడాలి అని ఆంజనేయస్వామికి నమస్కారము పెట్టుకున్నాను.

ఆ స్వామివారు B.H.P.V వద్దనున్న షీలానగరులో వుంటున్నారు. వారి యింటికి వెళ్ళితే అమ్మగారు మా బావగారితో ఆదరముగా మాట్లాడి స్వామివారు

సిం హాచలము వెళ్ళేరని చెప్పి మమ్మల్ని అక్కడకే వెళ్ళమన్నారు.

మేము ఆ వూరిలోనికి వెళ్తుండగానే మా బావగారు స్కూటరు ఆపండి , అదిగో స్వామివారు! అన్నారు. వెంటనే స్కూటరు ఆపి బావగారితో వారివద్దకు వెళ్ళాను. బావగారు యెదురుగా వస్తున్న వారిలో ఒక పెద్దాయనకు రోడ్డుమీదనే పాదాలకు నమస్కరించారు. బావగారితోపాటే నేను కూడా వారికి రోడ్డు మీదే నమస్కరించాను.

వారు ,చాలా గొప్ప విషయము నేను విన్నాను, మిమ్మల్ని చూడాలనిపించి నేనే రమ్మన్నాను. మురళీ నగరులోని మన రామ మందిరములో శ్రీ రామకోటి కార్యక్రమము చేద్దాము అని తనతోనున్న పండితులతో యీ శ్రీ రామ కార్యము మనము చేద్దామని చెప్పి, బాబూ! నేను వచ్చి దగ్గర వుండి చేయిస్తాను అన్నారు. నాకు నోట మాటలు రాలేదు. ఇది కలా ! నిజమా ! అన్నట్టుగా అలాగే ఉండిపోయాను.

తేదీ 17-06-1986 మంగళవారము దశమి నాడు మరియు తేదీ 18-06-1986 బుధవారము ఏకాదశి నాడు కోటి శ్రీ రామనామములకు పూజ , శ్రీ సీతా రాముల కళ్యాణ మహోత్సవము శాస్త్రోక్తముగా జరిగింది. అంతా కలలో జరిగినట్టుగా అయిపోయింది.

యీ సాధకుడు పోర్టు రామాలయము మాష్టారిని అడిగితే శ్రీ ఆంజనేయస్వామి ఆయనచేతే రోడ్డు మీద యెవరో దొరుకుతారు అని చెప్పించడమే కాకుండా యీ సాధకుని స్థాయికి మించి బ్రహ్మాండముగా మహాత్ములచేత చేయించారు.

' తననే నమ్మినవారిని స్వామి తనే నడిపిస్తారు 'అన్నది నాకు నిదర్శనము అయింది.

మనకూ దేవుళ్ళకూ మధ్య పరమగురువులైన 'సప్త మహా ఋషులూ వుంటారనీ , ప్రతీ ప్రాణి తాలూకా ప్రతీ అవయవానికీ అధిష్టాన దేవతలు వుంటారనీ, భగవంతుని కార్యక్రమములు చేసేవారికి, నిస్వార్ధముగా ఆర్తితో దైవ కార్యాలను చేద్దామని ఉన్నా యెలా చేయాలో , యేమి చేయాలో తెలియని వారికి దైవ అనుగ్రహమును కలిగించి సంతృప్తి కలిగిస్తారని యీ సాధకుడు యెక్కడో చదివాడు.

ఇటువంటి అద్భుతమయిన సంఘటనలు యెన్నో జరిగాయి. ఒక్కొక్కసారి యెలా చేయాలో తెలియక సతమతమవుతున్నప్పుడు మన యెదురుగా వున్నవారిద్వారా మనకు కావలసిన విషయము చెప్పిస్తారు. విచిత్రమేమంటే వారికి మనతో ఆ విషయము చెప్పుతున్నట్టుగా తెలియకపోవచ్చును.


జై మారుతీ ! జై జై మారుతీ !!

స్వామి రక్ష ! శ్రీ రామ రక్ష !!

శ్రీ రామ రక్ష ! సర్వ జగద్రక్ష !!

మాతృదేవోభవ ! పితృదేవోభవ !! అచార్య దేవోభవ !!!
.

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి