రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యములో వందల సంవత్సరాలు హీనముగా,బానిసబ్రతుకులు బ్రతికాము. స్వాతంత్ర సాధనకై కోట్లాదిమంది అసువులు బాసారు.కుటుంబ పెద్దలూ యువకులూ కారాగారాలలోనే జీవితాలలో యెక్కువ భాగాన్ని గడిపారు. ఆంగ్లేయులు మనవారిని యెంత హింసించినా అహింసాయుతముగానే స్వాతంత్ర్య ఉద్యమాన్ని నడిపించారు మహాత్మాగాంధీ వంటి యెందరో పెద్దలు.
ఎప్పుడెప్పుడా అని యెదురుచూసిన స్వతంత్రము వచ్చింది. అంతే మనవాళ్ళ ఆనందాలకు హద్దులు లేవు. భారతమాత శృంఖలాలనుండి విముక్తి పొందిందన్న సంతోషముతో ఉవ్వెత్తి ఎగసిపడుతున్న జన సముద్రానికి పిడుగులాంటి వార్త తెలిసింది. అంత వరకు కలసి ఉద్యమాలు నడిపిన కొంత మంది నాయకులు మత ప్రాదికతను అడ్డుపెట్టుకొని తమకు ప్రత్యేకముగా దేశము కావాలని పట్టుపట్టారు. అందరూ నిశ్చేష్టులయ్యారు. ఊహించని ప్రతిపాదన రాగానే యావద్భారతదేశము దిగ్భ్రాంతి చెందింది.
విభజించి పాలించడములో నిష్ణాతులయిన ఆంగ్లేయులు పోతూ పోతూ మతమును ఎరగా చూపించి కొంత మందిలో విషబీజాలు నాటి వెళ్ళిపోయారు. దేశ విభజన అనివార్యమయింది. దేశభక్తులకే కాదు సగటు మనిషికి కూడా కళ్ళంట కన్నీళ్ళు రాలేదు - రక్తాలు కారాయి. కొద్దిమంది స్వార్ధ పూరిత కోరికల కోసము కోట్లాదిమంది బలి అయిపోయారు.
దేశ విభజన సమయములో ఆస్తులనూ, నివాసాలనూ , బ్రతుకు తెరువులనూ,బంధు మితృలనూ, సర్వమునూ వదులుకొని పొట్ట చేతపట్టుకొని అటునుండి యిటూ, యిటునుండి అటూ వలసలు వచ్చేటప్పుడు యెన్నో ఘోరాలు జరిగాయి. స్వాతంత్ర ఉద్యమ నాయకులు బ్రతికి ఉండి జీవచ్చవాలుగా బ్రతికారు.
ఆ తరువాత కొన్నాళ్ళకు మన జాతిపిత మహాత్మాగాంధీ హత్య చేయబడినప్పుడు ప్రపంచములోని ప్రముఖ పత్రికలన్నీ సంపాదకీయాలు వ్రాశాయి. జవహర్ లాల్ నెహ్రూ తన దృష్టికి వచ్చిన అన్ని సంపాదకీయాలను చదివారు. అన్నిటిలోకి ఆయనకు ఒక సంపాదకీయము బాగా నచ్చింది. ఆ సంపాదకీయము మన దేశములోని పత్రికలలో వ్రాసింది కాదు. ఏ పాశ్చాత్య దేశములోని పత్రికలోనో రాలేదు. అది పాకిస్తానులోని ఆంగ్ల పత్రిక పాకిస్తాన్ టైంసు [pakistan taims] ' లో వచ్చింది. ఆ పత్రిక సంపాదకీయుడైన ఫైజ్ అహ్మద్ ఫైజ్ [faij ahmad faij] వ్రాసింది. ఆ సంపాదకీయములో మహాత్ముని ప్రశంస లేదు. ఆయనను హత్య చేసిన ఉన్మాదిని తిట్టడము లేదు. సకల మానవాళి మౌనముగా వ్యక్తము చేసిన ఆవేదనను ఆ సంపాదకీయము ప్రతిఫలించింది.
.
--గాంధీజీని యెవరు హత్య చేసారన్నది అప్రస్తుతమన్నారాయన. దేశ విభజన అనంతరము మహా ఘోరాలు జరిగినప్పుడే మహాత్ముడు మరణానుభూతిని పొందారు.ఇక మిగిలిందేవిటి?అటు తరువాత ఆయనకు ఉన్న స్థానమేవిటి?అన్నారాయన.
దేశ విభజన సృష్టించిన కృత్రిమ సరిహద్దులు ఫైజ్ భారతీయ అభిమానాన్ని యెమాత్రమూ తగ్గించలేకపోయాయి. ఆయన యెన్నో సార్లు మన దేశానికి వచ్చి తన స్నేహితులతో కలిసి మెలిసి తిరిగారు.పాకిస్తాన్ పాలకులు ఆయనను జైలులో పెట్టి కాగితాలు,కలము ఆయనకు అందకుండా చేస్తే -కలాన్ని,కాగితాన్ని లాగేసుకుంటే యెమి పోయింది? గుండె నెత్తురులో వేళ్ళు ముంచి జైలు గోడలపై వ్రాస్తాను అని అలాగే వ్రాసేవారు. ---- ఇది ఒక ఉదాహరణ మాత్రమే!
[ ఈ వ్యాసము ఈ సాధకుని తండ్రిగారైన కొమ్మూరు భాస్కరరావు గారు సేకరించినది. ]
ఆశ్చర్యమైన విషయము యేమిటంటే వందల సంవత్సరాలు మనలను బానిసలుగా చేసి మన దేశసంపదలన్నీ పట్టుకుపోయిన ఆంగ్లేయులు మనకు యిప్పుడు ప్రియమైనవారు . మన నుండి విడిపోయిన మన దాయాదులు మనకు పరమ శతృవులు!
దేశ పౌరుల మనోభావాలను పాలకులు గ్రహించడములేదు.భారత దేశపు గత చరిత్ర చాలా ఘనమయింది. ఆ ఘనత గతానికే మిగిలిపోతున్నట్టుంది.వర్తమానానికీ భవిష్యత్తుకీ ఆ ఘనత కలగానే మిగిలేటట్టుంది. దిక్కు లేని సగటు మనిషికి యిక దేముడే దిక్కు!
జై మారుతీ! జై జై మారుతీ !!
స్వామిరక్ష! శ్రీ రామ రక్ష !!
శ్రీ రామ రక్షా ! సర్వ జగద్రక్ష !!
2 కామెంట్‌లు:
ఆశ్చర్యమైన విషమము యేమిటంటె వందల సంవత్సరాలు మనలను బానిసలగు చేసి................వీడిపోయిన మన దాయాదులు మనకు పరమ శతృవులు.
ఈ వాక్యం చదివిన కోన్ని క్షణాల వరకు ఏదో తేలియని ఒక్క ఫిలింగ్ కలిగింది అది చేప్పలేను కాని మీరన్నది ముమ్మాటి సత్యం
hatsoff sir
chaalaa baagaa cepparanDi.
కామెంట్‌ను పోస్ట్ చేయండి