1978 జూలై నెల రెండవ వారములో నిండు చూలాలయిన శ్రీమతితో స్కూటరుమీద యింటికి వస్తున్నాను.మాముందు పెద్ద ట్రైలరుతో ట్రాక్టరు నెమ్మదిగా వెళ్తున్నాది. కుడిప్రక్కనుండి ట్రాక్టరుని తప్పించుకొని వెళ్తున్నాము. అకస్మాత్తుగా డ్రైవరు ట్రాక్టరును ఎడమప్రక్కకు మళ్ళించాడు. దాని వెనుకను ఉన్న ట్రైలరు విసురుగా వచ్చి మా స్కూటరునిగుద్దింది. ఆ తాకిడికి స్కూటరు,నేను,మాఅవిడ రోడ్డుమీద పడిపోయాము.స్కూటరు కుడిప్రక్క నేను - ఎడమ ప్రక్క మా శ్రీమతి పడిపోయాము. అదే సమయములో మాకు యెదురుగా మా మీదకు ఒక వేను [van] స్పీడుగా వస్తున్నాది. ఆ వేను మమ్మల్ని దాటివెళ్ళిపోవడము మేము రోడ్డుమీద పడిపోవడము రెప్ప పాటులో జరిగిపోయాయి.ట్రాక్టరు తాలూకా ట్రైలరు మా మీదనుండి వెళ్ళిపోయింది.అంతా రెప్పపాటులో జరిగిపోయింది.
అ ప్పుడే ఒక అద్భుతము జరిగింది. ఎవరో మా శ్రీమతిని,నన్ను లేపారు. స్కూటరుని నేను ఎత్తి నిలబెట్టాను. అదే సమయములో ఆ చుట్టుప్రక్కల వాళ్ళు మా వద్దకు వచ్చి మమ్మల్ని ప్రక్కకు తీసుకొని వెళ్ళారు. మా శ్రీమతికి ఏమయిందోనన్న ఆతృత నన్నక్కడ ఉండనివ్వలేదు. స్కూటరు వదలి ఆటో మీద ఫామిలీ డాక్టరు వద్దకు వెళ్ళిపోయాము. అంతా బావుంది అని డాక్టరుగారు చెప్పిన తరువాత యింటికి చేరుకొని ప్రమాదము గురించి యింటిలో చెప్పుతుంటే అప్పుడు జ్ఞాపకము వచ్చింది మమ్మల్ని ఎవరో లేపారని.
అప్పుడు అక్కడ ఎవరూ లేరు. మరి రోడ్డు మీదనుండి మమ్మల్ని లేపినది ఎవరు? ఏదో అదృశ్య శక్తి మమ్మల్ని కాపాడింది అని అర్ధమయి ఒళ్ళు జలదరించింది.అంతర్ముఖముగా అలజడి ప్రారంభమయ్యింది. ఏదో తెలియని తన్మయత్వము కలుగుతున్నాది. ఆనాటినుండి ఆఫీసులో క్రీడా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు తగ్గిపోయాయి.
మమ్మల్ని కాపాడిన దేవుడు ఎవరా? అని ఆతృతగా ఉంది. ఒక మంగళవారము ఉదయము 6 గంటలకు రేడియోలో పుష్పాంజలిలో యెవరో పాడుతున్నారు. ఆ గొంతుక, ఆ స్వరము నన్ను ఆకర్షిస్తున్నాది. నాకు తెలియకుండానే ఆ గొంతుకతో నా గొంతుక కలసి పాడుతున్నాది. ఆ పాట నేను అంతకు ముందు యెప్పుడూ వినలేదు. కాని నేనుకూడా పాడుతున్నాను. చాలా ఆశ్చర్యముగా ఉంది. రెండవ మంగళవారము ఆ పాట నేను ఆయనతో పూర్తిగా పాడాను. నాకే నమ్మకము కలుగడము లేదు. కాని యిది నిజం!
ఆ పాడుతున్నాయన సుందరదాసు m.s రామారావు గారు. ఆయన పాడుతున్నది తెలుగులో ఆయన వ్రాసుకున్న హనుమాన్ చాలీసా! ఆయన ఆంజనేయ స్వామిని తన గురువుగా భావించి పాడుతున్నారు. అప్పుడు నాకు అర్ధమయింది నన్ను కాపాడింది ఆంజనేయ స్వామియే అని. అంతే అప్పటినుండీ ఆంజనేయస్వామికి సర్వసమర్పణము అయిపోయాను.
నాకు పునర్జన్మను యిచ్చిన ఆంజనేయస్వామిని ఆరాధించడము మొదలయింది. చాలా మందికి యిటువంటి సంఘటనలు జరిగివుంటాయి కాని వాటిని పట్టించుకోరు. మరి యెందు చేతనో ఆ నాటినుండి నాలో మార్పు వచ్చింది. సాధన మొదలయింది.
తరువాత వివరములు దఫ దఫాలుగా మీకు తెలియచేసే అవకాశము గురుదేవులు శ్రీ ఆంజనేయ స్వామి యిస్తారని ఆశిస్తున్నాను.
'గాన గంధర్వ ' --- కొమ్మూరు ఉమాప్రసాద్ భాగవతార్ .
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి