అంతర్జాల మితృలకు నమస్కారము!
తేది 03-05-10 నుండి యీ రోజు(తేది 30-05-10)వరకు కలవనందుకు క్షంతవ్యుడిని. యీ సాధకుని ఆధ్యాత్మిక యాత్ర అంత సంతృప్తిగా లేకపోయినా సంకల్పము బలమైనది కనుక వృధాకాలేదు. హరిద్వార్ పూర్తిగా పర్యాటక కేంద్రముగా మారిపోయింది.
అసలు 1989 సెప్టెంబరు నెలలో మొట్టమొదటిసారి కేదార్నాథ్ , బదరీనాథ్ లు వెళ్ళేటప్పుడు ఆ పుణ్యభూమిని వదలి రావాలని అనిపించలేదు. చూసే ప్రతీ దృశ్యమూ దివ్యానుభూతియే! వేసే ప్రతీ అడుగూ గగుర్పాటే!
ఆ దివ్య క్షేత్రములో హరిద్వార్ , ఋషీకేశ్ , దేవ-ప్రయాగ , రుద్ర-ప్రయాగ , కర్ణ-ప్రయాగ, సోన-ప్రయాగ , నంద-ప్రయాగ( రెండు నదులు కలుస్తున్నప్పుడు ప్రయాగ అంటారు)మొదలయినవే కాకుండా ఉత్తర కాశీ , గుప్త కాశీ , గౌరీ కుండ్ , పంచ-కేదార్ , పంచ-బదరి , బదరీ వద్ద మానా గ్రామము వద్ద సరస్వతి నది అలకానంద లో కలిసే దృశ్యము , వ్యాస మహర్షి భారతము చెప్పుతుంటే వినాయకుడు వ్రాసినట్టుగా చెప్పబడే స్థలము , చైనా సరిహద్దుకు దగ్గరలోనున్న ఆఖరు పోస్టు ఆఫీసు , బదరీ నారాయణుడి ఆలయము వెనుకనున్న నీలకంఠ పర్వతమూ , బదరీకి వెళ్ళే త్రోవలో 10 కిలోమీటర్లముందు వున్న సంకీర్తన ఆంజనేయస్వామి దివ్య మంగళ విగ్రహమూ, యింకా యెన్నెన్నో దివ్యమైన స్థలములూ , పవిత్రతను పుణికి పుచ్చుకున్న ఆ దేవభూమిలో ఉన్నంతసేపూ తన్మయత్వముతో దివ్య లోకాలలో తేలిపోతున్న ఆనందమే! కేదార్నాథ్ , బదరీనాథ్ దేవాలయాలో కూర్చొని సంకీర్తన చేస్తుంటే ఉత్తరాదివారూ కూర్చొని పాల్గొనేవారు. భావనలూ , చర్యలూ పూర్తిగా దైవపరముగా ఉండేవి. ఆ దివ్య స్మృతులు జీవితాంతమూ పదిలపరచుకునేవారికి దైవానుగ్రహము కరతలామృతము.
ప్రతీ 4 సంవత్సరములకు ఒకసారి వెళ్ళే అదృష్టము 'స్వామి ' యిచ్చారు. రాను రానూ భక్తులు యెక్కువ అయ్యారు.సంవత్సరములో 6 మాసములు మాత్రమే అక్కడ వుండే అవకాశము కనుక భక్తులు యెక్కువ అయ్యేకొద్దీ వారి అవసరాలు తీర్చే స్థానికులు యెక్కువ అయ్యారు. స్థానికులు యెక్కువ అయ్యేకొద్దీ సహజ అరణ్యాల స్థానములో కాంక్రీటు అరణ్యాలు యెక్కువ అయ్యాయి. భక్తులతోపాటు పర్యాటకులు యెంత యెక్కువ అయ్యారంటే భక్తులకు పది రెట్లు అయ్యారు. దాంతో బాహ్య పరమయిన పవిత్రత కనుమరుగు అవుతున్నాది. పర్యాటకులు యెక్కువ అయ్యారు. జనాలూ , కాంక్రీటు వనాలూ యెక్కువ అవడమువలన పర్యావరణము పూర్తిగా దెబ్బతిన్నాది. కాలుష్యము విపరీతముగా పెరిగిపోయింది. స్థానికుల నివాసాలనుండీ , వ్యాపార కేంద్రాలనుండీ వ్యర్ధాలు పవిత్ర గంగలోనే కలుస్తున్నాయి. ఆధ్యాత్మిక కెంద్రాలు పర్యాటక కేంద్రాలుగా మారిపోయాయి. ఎప్పుడూ చల్లగా వుండే అక్కడ ఎండలు మండిపోతున్నాయి. .. అందుచేత దేవభూమిలో కలగవలసిన ఆధ్యాత్మిక భావాల బదులు లౌకిక భావాలు కలిగే పరిస్థితి ప్రస్థుతము నెలకొన్నది.
20 సంవత్సరముల క్రిందట కేదార్నాథ్, బదరీనాథ్ లకు వెళ్ళే దారులు మూసుకుపోతాయి, ఆ తరువాత భవిష్య బదరి , భవిష్య కేదార్ లలో మాత్రమే దర్శనము లభిస్తుంది అనేవారు. అలా జరిగినా బావున్ను.
అయితే యీ పరిణామాలకు మానసికముగా సిద్ధపడి వెళ్ళడము వలననూ , మన ఊర్లలో లౌకిక ప్రపంచములో మానవ నిర్మితమైన దేవాలయాలకు వెళ్ళేటప్పుడూ మరియు దైవ కార్యాలు చేసేటప్పుడూ ప్రశాంతతను , యేకాగ్రతను పొందే సాధన వలననూ ఋషీకేశ్ లో శ్రీ శివానంద ఆశ్రమములో వసతి భోజన సదుపాయములు లభించడము వలననూ అక్కడ వున్న 4 దినములు అద్భుత సాధన జరిగింది. నది ఒడ్డున స్వామి విగ్రహము వద్దా, ఆశ్రమములో చెట్ల క్రిందా వాద్య సహకారము లేకుండా '636 వ సుందరకాండ కధాగానము జరిపగలిగే అదృష్టము కలిగింది. ఆశ్రమములో గురు కుటీరములో సంధ్య హారతికి ముందు ఆశ్రమ వాసులతో కలిపి సంకీర్తన చేసే అవకాశము కలిగింది. శ్రీ శివానంద ఆశ్రమములో ఆశ్రమ పద్దతులు , నియమావళి చాలా చక్కగా వున్నాయి. బయట ప్రపంచము యెంత మారిపోయినా ఆ ఆశ్రమవాసులు మారకపోవడము చాలా గొప్ప విషయము!
ఇక హరిద్వార్ లో ప్రశాంతతకు అవకాశము లేదు. గంగా హారతికి ప్రతీ రోజు సాయంత్రము 10 వేలకు పైగా భక్తులు హాజరు అవుతున్నారు. అ రద్దీ తగ్గడానికి గంటకు పైగా సమయము పడుతున్నాది.
హరిద్వార్ నుండి వచ్చిన తరువాత మనసుకు కష్టము అనిపించి వారము దినములు యిల్లు కదలలేదు. ఆ తరువాత కార్యక్రమములు ,నైతిక బాధ్యతలు వల్ల తీరిక దొరకలేదు.
గురుదేవులు శ్రీ ఆంజనేయస్వామి దయతో మళ్ళీ కలుస్తాను.
జై మారుతీ! జై జై మారుతీ!!
.