.

మహా మనీషి , సద్గురువులకు గురువు, శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్యస్వామి వారి 88 వ జయంతి శ్రీరామనవమి నాడే!




ప్రవచన శిరోమణి , ఉభయ వేదాంత ప్రవక్తకులు , మహా మహోపాధ్యాయులు , దైవాంశ సంభూతులు శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్యస్వామి వారి జయంతి సందర్భముగా వారితో పరిచయమున్న ఒక సాధారణ భక్తుడుగా వారితో గల కొద్దిపాటి పరిచయమును పునస్కరించుకొని వారి గురించి మన అంతర్జాల మితృలకు తెలియజేసే సాహసమునకు పూనుకుంటున్నాను.

అస్సలు అటువంటి మహనీయుని గురించి మాట్లాడడానికే యెటువంటి అర్హత గాని , స్థాయి గాని , పరిజ్ఞానము గాని యీ సాధకుడికి లేవు. అయినా సాహసము చేస్తున్నాను. శ్రీరాముడు చాతుర్వర్ణాలవారికీ దేవుడే! శ్రీరాముని పూజించే అవకాశము అందరికీ ఉంది. అదే విధముగా గొప్ప వారిగురించి రెండు మాటలు చెప్పుకునే అవకాశము యీ సాధకునికీ ఉంది.

కొన్ని వేలమంది వారి ఉపన్యాసము వింటుంటారు. అయితే ప్రతీ ఒక్కరికీ వారు తనతోనే చెప్తున్నారన్న భావము కలుగుతుంది. సాధారణ భక్తులకూ , మహా జ్ఞానులకూ యెవరి స్థాయికి తగ్గట్టుగా వారికి అర్ధమవుతుంది. ఇది అపూర్వము.

దివంగత తెన్నేటి విశ్వనాధం గారు దేశ భక్తులు , విశాఖవాసులకు ప్రియమైన వారు. ఆయన తన సన్నిహితులతో ' కొంత మంది మాట్లాడుతుంటే వినాలి అనిపిస్తుంది. కొంతమంది మాట్లాడుతుంటే చాలా బాగా మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. కాని శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్యస్వామి వారు మాట్లాడుతుంటే సాక్షాత్తూ సరస్వతీదేవి వారి నాలుక మీద నాట్యము చేస్తున్నాదా ! అనిపిస్తుంది ' అని తరచుగా అనేవారు.

వారివద్ద కొన్నాళ్ళు బ్రహ్మ సూత్రాలు మొదలగునవి నేర్చుకొని వారు పెట్టిన పరీక్షలలో ఉత్తీర్ణులయి కొందరు జియర్ స్వాములు అయ్యారని పెద్దలు చెప్తారు.

అప్పలాచార్యస్వామి వారికి ధనిక ,పేద అన్న తేడా లేదు. తన వద్దకు వచ్చిన భక్తులను వారు ఆదరించే తీరు అమోఘము. దైవ కార్యాలలో వారి సలహాల కోసము వచ్చిన వారికి వచ్చిన వారి స్థాయికి తగ్గట్టుగా సూచనలు యిస్తారు. వారిగురించి యిలా యెంత చెప్పినా తక్కువే అవుతుంది.

యీ సాధకునికి వారితో యెన్నో విషయాలలో కొద్దిగా సాన్నిహిత్యము యేర్పడింది.

మొదటగా 3 నెలలలో సామూహికముగా ఒక కోటి శ్రీరామనామములు వ్రాయించగలిగానని వారే నన్ను పిలిపించుకొని 1986 జూన్ నెలలో పూజా కార్యక్రమాన్ని దగ్గరుండి జరిపించారు.

యీ సాధకుడు 4 సంవత్సరములు భగవత్ విషయములు సేకరించి ఆధ్యాత్మిక దర్పణము పేరుతో 1/8demmy size లో 200 పేజీలు ముద్రణకు సిద్దపడితే వారు ఓపికతో అన్ని పేజీలను దిద్ది, మంగళాశాసనములు వ్రాయడమే కాకుండా క్రిష్ణా ఆశ్రమములో అప్పటి పోర్టు ట్రష్టు చైర్మెన్ గారయిన శ్రీమాన్ P.V.R.K.ప్రసాద్ గారితో కలసి 1989 మే నెలలో ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు.

1978 లొ సుందరదాసు M.S.రామారావుగారు ఆశీస్సులతో సుందరకాండ పుస్తకమును యిచ్చినా గురుదేవులు శ్రీ ఆంజనేయస్వామి 1995 మార్చ్ నెలలో గానము చేసే అవకాశము యిచ్చారు. ఒక వారము రోజులుగా సాధన చేస్తున్నాము. ఆ విషయము వారికి యెవరో చెప్పితే వెంటనే నన్ను తీసుకొని రమ్మని చెప్పారు. నెను వెళ్ళితే కొద్దిగా పాడించుకొని తేది 30-03-1995 న వారు వచ్చి మొదటి గానమును ప్రారంభింపజేస్తాను అన్నారు. అప్పటికి ఒక వారము గూడా పూర్తిగా లేదు.స్వామీ కష్టమండీ! అని వేడుకున్నా ఫరవాలేదు మీరు తయారవుతారు అని నమ్మకంగా చెప్పడమే కాకుండా అదే దినమున మొదటి సుందరకాండ కార్యక్రమమును ప్రారంభింపజేసారు.

అర్ధాలతో కూడిన హనుమాన్ చాలీసా మరియు కొన్ని శ్లోకములతో కూడిన పుస్తకమును ముద్రించడానికి మొదటి విరాళము[100 రూపాయలు] వారు యిచ్చి యీ పుస్తకాలు లక్షకు పైగా ముద్రించ బడతాయని మంగళాశాసనము చేశారు. అవి యిప్పటికి ఒక లక్షా పదమూడు వేలు ముద్రించబడిభక్తులచే ఆదరించ బడుతున్నాయి .
ఇక వారి జననము విషయానికి వస్తే వారి తల్లి తండ్రులు సంతానము కోసము సింహ గిరి {శ్రీ సిం హాచలము దేవస్థానము} చుట్టూ ప్రదక్షిణము చేసేరని ,అప్పలాచార్యస్వామి వారు శ్రీ రామ నవమి నాడు జన్మించేరని ,వారు శ్రీ వరాహ లక్ష్మీ నరసిం హ స్వామి వారి మానస పుత్రులని వారి భక్తులు అంటారు.

శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్యస్వామి వారు దైవాంశ సంభూతులు. భౌతికముగా వారు లేకపోవచ్చును గాని కొన్ని వేల మంది హృదయాలలో వారు చిరంజీవిగా వుంటారు.
వారు తన భక్తులను ,అభిమానులను సదా

కాపాడుతుంటారనే నమ్మకము మా అందరికీ వుంది.




.

2 కామెంట్‌లు:

కొత్త పాళీ చెప్పారు...

చాలా సంతోషం మహనీయుల జీవితాల్ని తెలుసుకోవడం

మనోహర్ చెనికల చెప్పారు...

చాలా గొప్ప వివరాలను తెలియజేసారు. ధన్యవాదాలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి