.

తేది 17-03-2010 బుధవారము. మొదటిరోజు సుందరకాండ. హనుమ సముద్ర లంఘనం , లంఖిణిని జయించడము.


మనిషి అన్నవాడు యే విధముగా బ్రతకాలి అన్న విషయమై పెద్దలు యేమని చెబుతారంటే బ్రతికి ఉండగానే ' ఛీ వెధవ జన్మ ' అనిపించుకున్నట్టుగా కాకుండా చనిపోయిన తరువాత కూడా బ్రతికి ఉన్నట్టుగా బ్రతకాలని చెబుతారు. ఈ రోజులలో సుందరకాండ అనగానే స్వర్గీయ M.S.రామారావు గారే జ్ఞాపకము వస్తారు. ఆ విధముగా ఆయన చిరంజీవిగా వున్నారు.

వాయుసేనలో నున్న తన కుమారుని క్షేమము కోసము ఆయన వాయుదేవుని కుమారుడయిన ఆంజనేయస్వామిని ఆరాధించారు . అందుకోసము ఆయన తీవ్రముగా తపించేరు. అందుచేతను ఆంజనేయస్వామి దగ్గర కూర్చొని మొదట సుందరకాండను వ్రాయించుకున్నారు. అంతే కాకుండా ఆర్తిగా పాడించుకున్నారు. ఆంధ్ర లోకానికి ఎనలేని కానుకను యిచ్చారు.

అటువంటి మహత్తరమయిన సుందరకాండను ఒక సాధారణమయిన యీ సాధకుని చేత పాడించుకుంటున్నారు.

పక్షిరాజు సంపాతి సీతమ్మ లంకలో ఉన్నాదని చెప్పగానే జాంబవంతులవారు హనుమకు అతనికి చిన్నప్పుడే బ్రహ్మదేమునితో సహా దేవతలందరు తమ శక్తులనీ వరములుగా యిచ్చిన సంగతి గురించి , మునుల శాపము గురించి , శాప విమోచనము గురించి తెలియజేసి నీవు మాత్రమే యీ నూరు యోజనముల సముద్రమును దాటి సీతమ్మను చూసి రాగలవు అని చెప్పి, నువ్వు సీతమ్మను చూసి వస్తేనే మన అందరి ప్రాణములు సుగ్రీవుని బారిన పడకుండా నిలిచివుంటాయని చెప్పి బయలుదేరమని ప్రోత్సహించారు.

శ్రీరాముని కార్యము తన వలన అవుతుందని తెలిసి హనుమ సంతోషముతొ మహేంద్ర గిరి పైకి యెక్కిపోయి తనవారందరితో నేను రాముడు వదలిన బాణములాగ వెళ్తానని చెప్పాడు. అప్పుడే తన బలాన్ని గురించి ,దేవతల వరాల గురించి తెలిసినా . తను వెళ్ళగలనని తెలిసినా ఆ గొప్పదనాన్ని రామునికే ఆపాదించాడు. తద్వారా అహంకారము ఉండకూడదని తన చేతల ద్వారా తెలియజేశాడు.


మైనాకుని
ఉదంతము ద్వారా సత్కారాలలో మునిగిపోయి లక్ష్య సాధనను వదలకూడదని ,సురస ఉదంతము ద్వారా విహిత కర్మలు చేస్తున్నా వాటిని తామరాకు మీద నీటి బొట్టులాగ ఆచరించాలని , సిం హికను సమ్హరించడము ద్వారా నిషిద్ద కర్మలను నిర్దాక్షిణ్యముగా అణచివేయాలని తెలియజేశాడు. 'గోష్పదీకృత వారాశిం ' -అనగా నీటితో నిండిన ఆవు డెక్కను మనము దాటినట్టుగా హనుమ నూరు యోజనముల సముద్రాన్ని దాటాడు. లంకా నగర వైభవాన్ని చూసి చీకటి పడిన తరువాత లంకలోనికి వెళ్తున్న హనమను లంకిణి అడ్డగిస్తే ఎడమచేతి పిడికిలితో చిన్నపాటి దెబ్బ వేసేసరికి లంకిణి లోంగిపోయి యిక లంకకు చేటు తప్పదని చెప్పి లోపలకు వెళ్ళమని రాజమార్గము చూపించించింది. అభినయముతో , M.S రామారావుగారి బాణీలో గానముతో యీ రోజు కార్యక్రమము జరిగింది.
చక్కీర పొంగలి నేవేద్యము జరిగింది. ఆ ప్రసాదము తీసుకున్నవారికి భూత ,పిశాచ బాధలనుండి నివృత్తి జరుగుతుందన్న పెద్దల వచనములు తెలియజేసి అందరము ఆ ప్రసాదమును కళ్ళకు అద్దుకొని తీసుకున్నాము. శ్రీ రామ శరణం మమ !

శ్రీ మారుతీ పద భక్త కొమ్మూరు ఉమాప్రసాద్ భాగవతార్.



.

1 కామెంట్‌లు:

Kodavanti Subrahmanyam చెప్పారు...

శ్రీ కొమ్మూరు ఉమా ప్రసాద్ భాగవతార్ గార్కి
అయ్యా!
ఈరోజు మీ బ్లాగు శ్రీ నరసింహ మూర్తి గారు, నేను కలిసి చూసేము. చాలా ముచ్చటగా చూడముచ్చటగా మాకు యిరువురకు మనోరంజకం కలిగించినది . చాలా సంతోషించినాము. మీకు మా ధన్యవాదములు.
కొడవంటి సుబ్రహ్మణ్యం

కామెంట్‌ను పోస్ట్ చేయండి