స్వతంత్రమునకై జరిగిన ఘోరమైన యుద్ధము ముగియగనే మరల యుద్ధములు, స్వతంత్ర పోరాటములు, సాంఘిక పోరాటములు కలుగకుండ ;
మానవ జాతులలో స్నేహ వాత్సల్యములు, సోదర భావము , శాశ్వత శాంతి స్థాపితమగుటకును ; మానవాభివృద్ధి నిరాటంకము గను , శాంతముగను జరుగుటకును ;
ప్రపంచ పునర్నిర్మాణము యెటుల జరగవలెనను విషయమును గూర్చి ధీమంతులగువారు చర్చించడము మొదలిడినారు.
ఈ మహత్కార్యము జయప్రదముగా నెరవేరుటకు గాను
- తపస్సు, త్యాగము , అందరియందు సమభావము , సత్యము , అహింస [చాంద్యోగ ఉపనిషత్]
- మానవులందరియందును ప్రేమ [బృహదారణ్యక ఉపనిషత్ ]
- ఇతరులకు చెందినదాని కొరకు ఆశింపకుము [ఈశావాస్య ఉపనిషత్ ]
- ధనము కన్న ధర్మమే యెక్కువ [ బృహదారణ్యక ఉపనిషత్ ]
మొదలగు ధర్మముల మీద నిర్మింపబడిన భారతీయ నాగరికతా, ఆధ్యాత్మిక తత్వమే ప్రధాన స్థానమును ఆక్రమించవలసి ఉన్నది. దానిని అన్నిదేశములును గుర్తించు దినములు త్వరలోనే రాగలవు.
కావున మానవజాతి యొక్క శాశ్వతమైన శాంతికి, అభివృద్ధికి -- సర్వతోముఖమైన ఐహిక , ఆముష్మికమైన భారత జాతీయనాగరికత, స్వతంత్రము పునరుద్దరింపబడుట చాల అవసరమైయున్నది. మరియు భారతజాతి యొక్క ఆధ్యాత్మిక తత్వమును యితర జాతులు అవలంబింప వలసియున్నది.
భారతజాతి వేల సంవత్సరములుగ అఖండ త్యాగములచే కాపాడబడిన తన నాగరికతను వదలిపెట్టి విదేశీ నాగరికతలను అవలంబించుటకు యత్నించిన యెడల అది ఆత్మ వినాశకరము.
విదేశ నాగరికత పట్టకపోగా ఉన్నది కూడా పోయి జాతి నశించును. కావున భారతజాతి విదేశముల నుండి మంచివిషయములను నేర్చుకొని తన కార్యక్రమములలో చేర్చుకొనవలెనే కాని విదేశీ నాగరికతల యొక్క వ్యామోహము,అనుకరణము బొత్తిగా పనికి raadu .
ఉపనిషత్ ధర్మములు విశ్వ మానవ koaTiki వర్తించునవై కుల మత బేధములకును ,చెడు సాంఘిక ఆచార్యములకును ,ఎక్కువ తక్కువల అహంకార దోషములకును ఎట్టి అవకాశము లేనివై యున్నవి.
కావున ఉపనిషత్ ధర్మముల ఆచరణము యొక్క పునరుద్ధరణముతో హిందూ ,మహమ్మదీయ , క్రైస్తవ మత బేధములు అంతరించి దేశములో సమానత్వము , సోదరత్వము ,ఐకమత్యము కలుగ గలదు.
ఉపనిషత్ ధర్మము లనెడి గంగా నదీ ప్రవాహముతో -
ఇస్లాము యొక్క ఏకేశ్వరోపాసనము,సోదరత్వము -
క్రైస్తవ మతము యొక్క త్యాగము,ప్రేమ తత్వములు యమునా సరస్వతుల వలె సమ్మేళణమై నవ్య భారత జాతీయ జీవన వాహినిగా ప్రవహించ గలదు.
భారత నూతన జీవము కలిగి నిస్సహాయతకు బదులు ఆత్మ విశ్వాసము, ఆత్మ శక్తి, ఆత్మ స్వాతంత్ర్యములు ,ధైర్య స్థైర్యములు, చురుకుదనము,సోదర భావము, ఐక మత్యము, దైవ భక్తి, పరమార్ధిక చింతనము, అహింసా సత్యములు, స్వార్ధ త్యాగము ,మానవ సేవ యందు అనురక్తి, దేశోద్ధరణ శక్తి మొదలగు సద్గుణములు కలిగి తమ జాతిని సర్వ విధముల ఉద్దరించుకొనుటకు శక్తివంతులమగుదురు.
మానవ జాతి యొక్క నాగరికతా పుష్పమునకు మరల భారతీయ నాగరికతా పుష్పములు నూతన సౌరభమును,శోభను కలుగ జేయగలవు.
[ ఈ వ్యాసము ఆచార్య వినోభా భావే వారిచే రచింప బడినది. అయ్యదేవర కాళేశ్వరరావు గారిచే అనువదించ బడినది. ఈ సాధకుని తండ్రిగారైన కొమ్మూరు భాస్కర రావు గారిచే తేది 09-11-74 న సేకరించ బడినది.] ----------- జై మారుతి!