.

శ్రీ హనుమత్ వ్రతము

  • శ్రీ హనుమత్ వ్రతము [తే 30-11-09 దీ సోమవారము]సందర్భముగా అంతర్జాల మితృలందరినీ గురుదేవులు శ్రీ ఆంజనేయస్వామి ఆయువు,ఆరోగ్యము,ఐశ్వర్యము యిచ్చి సదా కాపాడుతుండాలని కోరుతున్నాను.
  • వినాయక వ్రతము , సత్యనారాయణ వ్రతము ,త్రినాధ వ్రతము, కేదార వ్రతము, మంగళ గౌరీ వ్రతము ,వరలక్ష్మీ వ్రతముల వలే శ్రీ హనుమత్ వ్రతము కూడా చేసుకుంటారు. అయితే ఎక్కువ మందికి తెలియదు.
  • ఈ వ్రత విధానము తెలియక పోయినా యీ దినమున సూక్ష్మముగానయినా శ్రీ ఆంజనేయస్వామి పూజ చేసుకుని రుద్ర స్వరూపుడు,సకల దేవతల శక్తులను వరముగా పొందిన వాడు అయిన శ్రీ ఆంజనేయస్వామి పంచోపచార పూజ చేసుకుందాము.
    మాతృదేవో భవ! పితృదేవో భవ! ఆచార్యదేవో భవ!
    ఓం శ్రీ గురుభ్యో: నమహా.[నమ హా అని పలకండి]
    ఓం గం గణపతయే నమహా!
    ఓం శ్రీ పంపా[నదీ]మాతాయై నమహా!
    [ఇప్పుడు అయిదు ఉపచారములతో పూజ.అయిదు ఉపచారములలో యే వస్తువు లేకపోయినా పరికల్పయామీ అని పలకండి ]
    (1)ఓం శ్రీ సువర్చలా సమేత శ్రీ ఆంజనేయాయ నమహా!- గంధం సమర్పయామీ.
    (2)ఓం శ్రీ సువర్చలా సమేత శ్రీ ఆంజనేయాయ నమహా!-పుష్పం సమర్పయామీ.
    (3) ఓం శ్రీ సువర్చలా సమేత శ్రీ ఆంజనేయాయ నమహా!- ధూపం ఆఘ్రాపయామీ.
    (4) ఓం శ్రీ సువర్చలా సమేత శ్రీ ఆంజనేయాయ నమహా!- దీపం దర్శయామీ.
  • -- [ఇప్పుడు 108 నామములతో పూజ. ఈ మంత్రములలో మీకు సరిపడ్డ మంత్రమును ఎంచుకొని ప్రతీ అక్షరమును తదేక ధ్యానముతో పైకి వినబడునట్టుగా పలకండి]
  • శ్రీ హనుమతే నమహా!
    ఓం శ్రీ రామ భక్తాయ నమహా!
    ఓం నమో భగవతే శ్రీ ఆంజనేయాయ !
    ఓం శ్రీ హరి మర్కట మర్కటాయ స్వాహా!

(5) ఓం శ్రీ సువర్చలా సమేత శ్రీ ఆంజనేయాయ నమహా!- నైవేద్యం సమర్పయామీ(నైవేద్యము లేకపోయిన 'ఆత్మ నివేదనం సమర్పయామీ' అని ఆత్మ సమర్పణము చేసుకోండి.

ఈ విధానము జపము చేసేటప్పుడు ఉపయోగిస్తాము కానీ ప్రవాసాంద్రులకూ ,పూజా పుస్తకములు లేనివారికీ, ఎక్కువ సమయము దొరకని వారికీ యీ పద్దతి సరిపోతుంది.

ఈ సాధకుడిని 31 సంవత్సరముల క్రిందట తన మార్గములోనికి మరల్చుకొని నడిపిస్తున్నారు. ఆయన ఋణము తీర్చుకునేందుకూ, ఆయన అనుగ్రహము రుచి చూపించేందుకూ, భక్తి వుండీ మార్గ దర్శనము లేని వారికోసమే యీ విధానము తెలియచేసే ప్రయత్నము యీ సాధకుడు చేస్తున్నాడు.

ఈ పుణ్య దినమున, అనంతమైన శక్తి వచ్చే యీ మహత్తరమైన దినమున మీరూ, మీ సన్నిహితులూ యీ సువర్ణ అవకాశమును సద్వినియోగము చేసుకొని స్వామి అనుగ్రహమునకు పాతృలు కండి. --

శ్రీ ఆంజనేయ స్వామి దయతో మీ ముందుకు మళ్ళీ రాగలను.

---- ఈ సాధకుడు కేవలము నాదోపాసకుడు. కేవలము సంకీర్తనపరుడే కాని హరిదాసు కాదు.పెద్దల ఆశీస్సులు సదా కోరువాడు.

జై మారుతీ!- జై జై మారుతీ!
స్వామి రక్ష -శ్రీ రామ రక్ష!

శ్రీ రామ రక్ష! - సర్వ జగద్రక్ష !
'శ్రీ మారుతీ యక్ష గాన ప్రవీణ్' కొమ్మూరు ఉమాప్రసాద్ భాగవతార్.

.

ఏమండీ! మీ యింటిలో పిల్లి ఉన్నాదా?

ఏమండీ! మీ యింటిలో పిల్లి ఉన్నాదా? శంకరరావు తనకు తెలిసిన వాళ్ళను, యిరుగు పొరుగు వాళ్ళను ఏమండీ! మీ యింటిలో పిల్లి వున్నాదా? అని అడుగుతున్నాడు. ఎవరిని అడిగినా లేదనే అంటున్నారు. పట్నం శివార్లకు వెళ్ళి అందరినీ అడుగుతుంటే అదృష్టము వలన పిల్లి దొరికింది. రెండు రోజుల శ్రమ ఫలించింది అని స్థిమితపడ్డాడు శంకరరావు. కీర్తి శేషులయిన తన తండ్రిగారి సంవత్సరీకము [ ఆబ్దీకము ] రోజున ఆ పిల్లిని తీసుకొని వచ్చి పాలు తాగించి దానిని వంటయింటిలోను ,పూజ గదిలోను కాకుండా సామానులగదిలో కట్టి, శుద్దిగా స్నానము చేసి తృప్తిగా తండ్రిగారికి, పెద్దలకు శాస్త్రవిహిత కర్మలను ఆచరించి సంతోషపడ్డాడు.
పిల్లి దొరకదేమోనని ఆందోళణ పడ్డాడేమో శంకరరావుకి ఆ రెండు రోజులు నిద్ర పట్టలేదు.తండ్రి అంటే చాలా ప్రేమ ,గౌరవము వున్నాయి . అయన తన తండ్రిగారికి,పెద్దలకు పితృ కర్మలను ఆచరించేటప్పుడు పిల్లిని కట్టి , శుద్ది అయి పూజలు చేయడము శంకరరావు చాలా పర్యాయములు గమనించే వాడు.తన తండ్రిగారి పద్దతులు పాటించి ఆయనపై తనకు గల గౌరవమును చూపించుకున్నాడు.
శంకరరావు నాన్నగారికి స్వగ్రామములో పౌరోహిత్యముతోపాటు వ్యవసాయము కూడా వున్నాది. పండిన ధాన్యమును ఎలుకల బారినుండి కాపాడుకోవడానికి ఆయన పిల్లిని పెంచేవారు. ఎంత పెంపుడు పిల్లి అయినా దైవకార్యములూ , పితృకార్యములూ చేసేటప్పుడు మాత్రము దానిని కట్టేసేవారు. అది గమనించిన మన సుబ్బారావు యింటిలో పిల్లి లేకపోయినా దానిని సంపాదించి మరీ పితృకర్మలను ఆచరించాడు.
విశాఖలో శ్రీ ఆంజనేయస్వామి ఆలయములో అయిదు సంవత్సరముల క్రిందట వేదపండితుల ఘోష్టిలో పెద్దలు యీ విషయమును చెప్పి యేది యెందుకు చేస్తున్నామో తెలుసుకునే ప్రయత్నము చేయకుండా గుడ్డిగా చేస్తున్నారు అని బాధపడ్డారు. శాస్త్ర పరిఙ్నానము అభ్యసించే ఆసక్తి తగ్గిపోతున్నాది. రాను రాను ఘనాపాటి లు కనుమరుగు అవుతున్నారు అని విచారము వెలిబుచ్చారు.
ఈ కర్మ భూమికి యేది మూలమో ఆ సంపదకు ఆదరణ తగ్గిపోతున్నాది. కొన్ని ఆధ్యాత్మిక సంస్థలు వేద సంపదలను అడుగంటిపోకుండా కృషి చేస్తున్నాయి గాని వాటికి పెద్దల అండదండలు , ప్రోత్సాహము చాలడము లేదు. శ్మశాన వైరాగ్యము లాగ సభలలో బాధపడి వూరుకోవడమేనా? పిల్లి మెడలో గంటలు కట్టే పుణ్యమూర్తులు లేరా?
.

దేముడి నుండి మనకు వచ్చే మూడు ఉత్తరాలు

దేముడినుండి మనకు వచ్చే మూడు ఉత్తరాలు.
సుబ్బారావు అనే అతను ఉద్యోగరీత్యా విశాఖపట్నము వచ్చాడు. అతనికి సాయంకాలముపూట బీచి[సముద్రపు ఒడ్డు]లో కూర్చొని విశ్రాంతి లేకుండా నిర్విరామముగా ఉవ్వెత్తునవచ్చి వెనక్కుపోయే కెరటాలనుచూస్తూ కూర్చోవడము చాలా సరదా! రోజులు,నెలలు,సంవత్సరాలు గడుస్తున్నా అతను ఆ అలవాటు మానుకోలేదు సరికదా- చీకటి పడిపోయినా ,చుట్టుప్రక్కల ఎవరూ లేకపోయినా వంటరిగానే సముద్రపు ఆ చివరిని చూస్తూ కాలము గడిపేవాడు.
ఒక రోజు సాయంత్రము చీకటి పడిపోయినా అలవాటు ప్రకారము కూర్చుండిపోయాడు. చుట్టూ యెవ్వరూ లేరు. కెరటాల హోరును శ్రవణానందముగా వింటూ ఉవ్న్నాడు. హఠాత్తుగా సముద్రముమీద చాలా దూరమునుండి యేదో ఆకారము అస్పష్టముగా రావడము కనిపించింది. ఆ ఆకారము అతనివైపునే వస్తున్నాది. ఏదో పడవేమో అనుకున్నాడు. కాని ఆ ఆకారము దగ్గరకు వచ్చేసరికి యెనుబోతుమీద కిరీటముతో చేతిలో పాశముతో ఆ వస్తున్నది 'యమధర్మరాజు ' అని అర్ధమయింది. నోటమాటరాక వళ్ళంతా చెమటలు పట్టి గుండె కొట్టుకుంటున్న శబ్ధముతప్ప సముద్రపు హోరు వినిపించడము లేదు. భయంభయంగా చూస్తున్న అతనిముందు నుండే 'యమధర్మరాజు ' వెళ్ళిపోతున్నారు. సుబ్బారావుకి ప్రాణము లేచి వచ్చింది. కొద్దిగా ధైర్యము తెచ్చుకొని, ' యమధర్మరాజు గారూ! ఆగండి! ' అని పిలిచాడు. యమధర్మరాజు గారు ఆశ్చర్యముతో వెనుకకు తిరిగి చూసి యీ మానవులు పౌరాణిక నాటకములు చలన చిత్రములు చూసి మనలను పోల్చుకుంటున్నారు అనుకొని ఆగారు.సుబ్బారావు నెమ్మదిగా ఆయన దగ్గరకు వెళ్ళి మీరు దేముడే కదా! మరి నాకు కనిపించి కూడా వరము యివ్వకుండా వెళ్ళిపోవడము ధర్మమా? ధర్మరాజా! ' అని అడిగాడు. ధర్మరాజు నవ్వుకుంటూ," సరే! నీకు యేమి వరము కావాలి?" అని అడిగారు. సుబ్బారావు సంతోషముతో,'మీరు నా గురించి వచ్చినప్పుడు నాకు తెలియజేసి రావాలండీ!' అని అడిగాడు. " సరే! నీకు మూడు ఉత్తరాలు పంపి వస్తానులే! అని ఆయన వెళ్ళిపోయారు. 'తన మృత్యువు తనకు ముందే తెలుస్తున్నాదని సంతోషముతో సుబ్బారావు పొంగిపోయాడు.
రోజులు, నెలలు, సంవత్సరాలుగడుస్తున్నాయి. సుబ్బారావు బీచికి వెళ్ళడము మానలేదు. ఈలోగా అతనికి వివాహము అయింది. పిల్లలు పుట్టి, చదువుకుంటూ, పెద్దవారు అయి, వివాహములు అయి స్థిరపడ్డారు. ఈయనకు ఉద్యోగములో ప్రమోషనులు వరుసగా వచ్చాయి. స్వంత యిల్లు కట్టుకున్నాడు.ఉద్యోగమునుండి రిటైర్ అయ్యాడు.అయినా బీచికి వెళ్తూనే వున్నాడు.
ఒక రోజు సాయంత్రము బాగా చీకటి పడిపోయింది. యమధర్మరాజు వచ్చి యెదురుగా నిలబడ్డారు. సుబ్బారావు ఆయనకు నమస్కరించి,'స్వామీ! యీ రోజు పాపం యెవరికి మూడింది? 'అని అడిగాడు. "ఇంకెవరికి? నీకే! "అని యమధర్మరాజు అన్నారు! 'అదేమిటి స్వామీ! మూడు ఉత్తరాలు పంపిన తరువాత వస్తానని చెప్పి యిప్పుడు హఠాత్తుగా రావడము మీకు ధర్మమా?' అని సుబ్బారావు దూఃఖముతో అడిగాడు. ధర్మరాజు "నాయనా! నీకు జుత్తు నెరిసిందా? ' అని అడగగానే సుబ్బారావు, ' నెరిసిందండీ! కాని యిదుగో రంగు వేసుకున్నాను ' అన్నాడు. " సరే! నీకు చూపు తగ్గిందా? "అని ఆయన అడగగానే ,'తగ్గిందండీ! కళ్ళద్దాలు పెట్టుకున్నానండీ!'అని యీయన జవాబు యిచ్చాడు. "సరే! నీకు దంతాలు కదిలాయా?" అని ఆయన అడగగానే యీయన, 'కదలదమేమిటి! చాలా ఊడిపోతే పళ్ళు కట్టించుకున్నానండీ! ' అని యీయన చెప్పాడు. యమధర్మరాజు గారు తాపీగా," అవే నాయనా! మేము నీకు పంపిన మూడు ఉత్తరాలు. మా లోకము పద్దతి ప్రకారము ఉత్తరాలు అలానే పంపుతాము"అని సుబ్బారావు ప్రాణాలను తీసుకు పోయారు.
ఈ కథ - పూజ్యులు దైవ స్వరూపులు శ్రీ శ్రీ శ్రీ శ్రీరంగ రంగరాజ జియ్యరు స్వామివారు సుమారు 16 సంవత్సరముల క్రిందట విశాఖలో చెప్పినారు. మొదటి ఉత్తరము రాగానే బాహ్య దృష్తిని తగ్గించుకొని భగవత్పరముగా జీవితమును గడిపి భగవంతుని అనుగ్రహపాత్రులు అవ్వాలని వారు మంగళాశాశనములు చేశారు.
సర్వే జనా సుఖినోభవంతు! అంతర్జాల మితృలందరికీ నమస్కారములతో
--- శ్రీ మారుతీ పద భక్త కొమ్మూరు ఉమాప్రసాద్ భాగవతార్
.

మహా మనీషి

మహా మనీషి! పురుషులలో పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ వినుర వేమా! -అన్నట్టుగా మనిషికీ మహా మనిషికీ చాలా తేడా ఉంది. అటువంటి ఒక మహా మనిషి గురించి తెలుసుకుందాము.

దివ్యఙ్ఞాన సమాజ సిద్దాంతము ప్రకారము భగవత్తత్వము గురించి,భగవంతునికి-మనిషికి గల సంబంధము గురించి మానవాళికి తెలిపి వారిని సంస్కరించుటకు భగవంతునిచే నియమింపబడిన మహాపురుషు [ పరమగురువు]లకూ - మానవాళికీ మధ్య గురువులు కలరు. వారు[అనీబిసెంటు అమ్మగారు, కర్నల్ ఆల్కాటు , లెడ్బీటరు వంటి పెద్దలు ] ప్రపంచ దేశాలన్నిటిలోను తమ దివ్య ఙ్ఞాన సమాజమును విస్తరింపజేసి చివరికి కర్మ భూమి అయిన భారత భూమియే తమ కేంద్ర స్థానముగా నిర్ణయించుకొని టిబెట్ దగ్గఱలోగల హిమాలయా పర్వతాలను తమ స్థావరముగా స్థిరపరచుకొని తమ సమాజమునకు భవిష్యత్ గురువును కనుగొనుటకు తీవ్ర ప్రయత్నాలు చేశారు.

ఆ కాలములో మన రాష్త్రములో దివ్య ఙ్ఞాన సమాజమునకు యెంతో ఆదరణ ఉండేది.ఆ విధముగా పెద్దలు చిత్తూరుజిల్లాలోగల మదనపల్లి [1908 లో] వచ్చినప్పుడు ఒక 13 సంవత్సరాల బాలుడిని చూడగానే వారికి అంగీకారసూచనగా అంతరంగా సంకేతాలు అందాయి. అప్పుడు వారు ఆనందముతో ఆ బాలుని తండ్రికి తమ దృక్పధము తెలియజేయగానే ఆయన తను యే సమాజములో సభ్యుడో ఆ సమాజమునకు అధినేతగా 11 గురు ఉన్న తమ సంతానములో 8 వ సంతానమయిన కృష్ణమూర్తిని వారికి యిచ్చుటకు సంతోషముతో అంగీకరించాడు. కాని ఆ బాలుడు తన అన్న తనతో వస్తేనే తను వెళ్తానని అనడముతో అన్నదమ్ములు యిద్దరినీ వారితో పంపించారు.

పరమగురువులు ఆ అబ్బాయి[ జిడ్డు కృష్ణమూర్తి]ని తీర్చి దిద్దే బాధ్యతను అనీబిసెంటు అమ్మగారికి అప్పజెప్పారు. ఆ అబ్బాయి ఆ వయస్సు నుండే లోకానికి గురువు కాగల అర్హతలను సంపాదించడము మొదలు పెట్టాడు. వేదాలనూ సకల శాస్త్రాలనూ క్షుణ్ణంగా అభ్యసించాడు. పరమగురువుల అశీస్సులు ,అభినందనలు పొంది చివరకు వారసత్వము పొందాడు. మధ్యలో తనతోటి అన్నదమ్ముని మరణము కొంత క్రుంగదీసినా ఆ కారణముగానే ఆధ్యాత్మికముగా ఎంతో ఉన్నతమయిన స్థాయికి యెదిగాడు. పువ్వు పుట్టగానే పరిమళము వెదజల్లినట్టు చిన్న వయస్సులోనే' పరమ గురువు చరణ సన్నిధి '[ ఎట్ ద ఫీట్ అఫ్ ద మాస్టర్] పుస్తకము వ్రాయుట ద్వారా తన ప్రతిభను చాటాడు.

ప్రపంచ వ్యాప్తంగా ఆయన అభిమానులు తమ యావదాస్తుల్నీ ఆయన ఆధిపత్యములోని తూర్పు దేశపు ధ్రువ తార [స్టార్ అఫ్ ద ఈస్ట్] అను సంస్థకు ధారపోశారు.ఆయన ప్రపంచ దేశాలన్నీ తిరుగుతూ ఉపన్యాసాలిచ్చేవారు.యావత్ప్రపంచమూ ఆయనను భగవంతుడిగానే కొలిచేవారు. అనీబిసెంటు అమ్మగారు,యితర పెద్దలు తాము నాటిన విత్తనము మహా వృక్షమయి ఫలాలను యివ్వడము చూసి గర్వపడేవారు.

అయితే రానురాను ఆ సమాజ సభ్యులూ ,ఆయన శిష్యులూ ఆయన దగ్గరకు వచ్చే భక్తులను ఆదాయము దృష్థితో కట్టడి చేసేవారు. ఆయనకు తాను విశ్వ మానవ సమాజములోనికి స్వేచ్చగా వెళ్ళలేకపోవడము బంధనము అనిపించి, సమాజ సభ్యుల సంకుచిత భావాలకు తిరుగుబాటు చేసి , సమాజానికి దానము చేసినవారికి యెవరి ఆస్తులు వారికే యిచ్చేసి తాను కేవలము మనిషినేనని అందరూ అనుకుంటున్నట్టు తాను భగవంతుడిని కానని ప్రకటించి సమాజ పెద్దలను కృంగదీసి యావత్ప్రపంచాన్నీ విస్మయ పరచి, మనిషిగా తన గొప్పదనాన్ని నిరూపించుకొని భగవంతుని సేవలోనే పూర్తిగా నిమగ్నమయి 1987 లో పరమపదించారు.

ప్రపంచమంతా తనను భగవంతుడుగా కొలుస్తుంటే పరిపక్వమయిన ఙ్ఞానముతో తాను డేవుడిని కానని-డేవుడిని కొలిచే మానవుడిని అని చాటిన ఆ మహా మనీషి మన తెలుగు వాడే కావడము మన అదృష్ఠము కాదా!

గురు దేవులు శ్రీ ఆంజనేయ స్వామి దయతో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నము చేస్తాను. ---కొమ్మూరు ఉమాప్రసాద్ భాగవతార్ . సెల్ 9848462805

.

ఫ్రపంచములోని అన్ని జీవులకన్నా ప్రమాదకరమైన జీవి

లండనులో ఒక పెద్ద జంతు ప్రదర్శనశాల ఉంది. ఆందులో ప్రపంచములోనున్న అన్ని రకముల పక్షులనూ,జంతువులనూ ప్రదర్శిస్తుండేవారు. నిర్వాహకులు ఎప్పటికి అప్పుడు కొత్త కొత్త వాటిని సేకరించి అక్కడ ప్రదర్శిస్తుండడము వలన సందర్శకులకు కొత్తదనము వుండేది. ఫ్రతీ జంతువు/పక్షి ముందు వాటి వివరాలతో బోర్దులు పెట్టేవారు. ఎన్నో రకముల కౄర మృగాలనూ, సాధు జంతువులనూ, సర్పాలనూ, మొసళ్ళనూ,రక రకముల పక్షులనూ చూస్తూ వాటి వివరాలను చదువుకుంటూ వెళ్తున్న వారికి చివరగా ఒక పెద్ద బోర్డు కనిపించింది. అందులో “మీరు ఇప్పుడు ప్రపంచములోని అన్ని జీవులకన్నా అతి ప్రమాదకరమైన జీవిని చూడబోతున్నారు. ఆ జీవిలో ఇంతవరకూ మీరు చూసిన వాటి అన్నిటి గుణాలూ మేళవించి ఉన్నాయి “ అని వ్రాసి ఉంది. అది చదివిన వారు ఆ అతిప్రమాదకరమైన జీవిని చూడడానికి ఆతృతతో లోనికి వెళ్ళారు. అక్కడ పెద్ద అద్దము వుంది . అందులో ఎవరిని వారే చూసుకుంటున్నారు!
-- సుమారు 25 సంవత్సరముల క్రిందట ఒక ప్రముఖ తెలుగు దినపత్రికలో మొదటి పేజీలో పైన కుడిప్రక్కన చిన్న బాక్సులో [ ఆ రోజులలో ఇటువంటివే వ్రాసేవారు] యీ సాధకుడు చదివాడు. జంతువులు,పక్షులు,మొసళ్ళు, పాములు - ఆహార,నిద్రా మైధునాలను ఒక క్రమమైన పద్దతిలో నిర్వహిస్తాయి కాని మనిషికి ఆ విచక్షణా జ్ఞానము లేదు. ఏ క్షణములో ఎలా మారిపోతాడో తెలియదు. నైతిక విలువలను పాటించడు. సమాజములో తన ఆదిపత్యమే లక్ష్యముగా, ఆశలకు అంతులేకుండా, స్వార్ధమే పరమావధిగా సాగిపోతున్నాడు. ఏవరయినా తనకు ఏది చెయ్యకూడదు అనుకుంటున్నాడో అది తను ఇంకొకరికి చెయ్యకూడదన్న వివేకము ఎప్పుడు వస్తుందో - అప్పుడే సమ సమాజము ఆవిష్కరింపబడుతుంది. మనిషి మనుగడ బావుంటుంది. ఆ రోజులకోసం ఎదురు చూద్దాం.
కౄర మృగమ్ముల కోరలు తీసెను –
ఘో రా ర ణ్య ము లా క్ర మించెను-
హిమాలయము పై జండా పాతెను-
ఆకాశములో విహారం చేసెను-
అయినా..ఆ.. మనిషి మారలేదూ –
ఆతని వాంచ తీరలేదూ ‘
ఇది అక్షర సత్యమే కదా!
"గురు దేవులు శ్రీ అంజనేయ స్వామి దయతో యీ సాధకుడు మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నము చేస్తాడు. అన్నట్టు 'దేముడిని తరిమేశాం ' అని దీనికి ముందు వ్రాసినది " శ్రీ కంచి కామ కోటి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారు " 1982 లో విశాఖలో చెప్పారు. జై మారుతీ జై జై మారుతీ .
-----ఉమాప్రసాద్ కొమ్మూరు.{తెలుగు బ్లాగు 18782}
.