మహా మనీషి! పురుషులలో పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ వినుర వేమా! -అన్నట్టుగా మనిషికీ మహా మనిషికీ చాలా తేడా ఉంది. అటువంటి ఒక మహా మనిషి గురించి తెలుసుకుందాము.
దివ్యఙ్ఞాన సమాజ సిద్దాంతము ప్రకారము భగవత్తత్వము గురించి,భగవంతునికి-మనిషికి గల సంబంధము గురించి మానవాళికి తెలిపి వారిని సంస్కరించుటకు భగవంతునిచే నియమింపబడిన మహాపురుషు [ పరమగురువు]లకూ - మానవాళికీ మధ్య గురువులు కలరు. వారు[అనీబిసెంటు అమ్మగారు, కర్నల్ ఆల్కాటు , లెడ్బీటరు వంటి పెద్దలు ] ప్రపంచ దేశాలన్నిటిలోను తమ దివ్య ఙ్ఞాన సమాజమును విస్తరింపజేసి చివరికి కర్మ భూమి అయిన భారత భూమియే తమ కేంద్ర స్థానముగా నిర్ణయించుకొని టిబెట్ దగ్గఱలోగల హిమాలయా పర్వతాలను తమ స్థావరముగా స్థిరపరచుకొని తమ సమాజమునకు భవిష్యత్ గురువును కనుగొనుటకు తీవ్ర ప్రయత్నాలు చేశారు.
ఆ కాలములో మన రాష్త్రములో దివ్య ఙ్ఞాన సమాజమునకు యెంతో ఆదరణ ఉండేది.ఆ విధముగా పెద్దలు చిత్తూరుజిల్లాలోగల మదనపల్లి [1908 లో] వచ్చినప్పుడు ఒక 13 సంవత్సరాల బాలుడిని చూడగానే వారికి అంగీకారసూచనగా అంతరంగా సంకేతాలు అందాయి. అప్పుడు వారు ఆనందముతో ఆ బాలుని తండ్రికి తమ దృక్పధము తెలియజేయగానే ఆయన తను యే సమాజములో సభ్యుడో ఆ సమాజమునకు అధినేతగా 11 గురు ఉన్న తమ సంతానములో 8 వ సంతానమయిన కృష్ణమూర్తిని వారికి యిచ్చుటకు సంతోషముతో అంగీకరించాడు. కాని ఆ బాలుడు తన అన్న తనతో వస్తేనే తను వెళ్తానని అనడముతో అన్నదమ్ములు యిద్దరినీ వారితో పంపించారు.
పరమగురువులు ఆ అబ్బాయి[ జిడ్డు కృష్ణమూర్తి]ని తీర్చి దిద్దే బాధ్యతను అనీబిసెంటు అమ్మగారికి అప్పజెప్పారు. ఆ అబ్బాయి ఆ వయస్సు నుండే లోకానికి గురువు కాగల అర్హతలను సంపాదించడము మొదలు పెట్టాడు. వేదాలనూ సకల శాస్త్రాలనూ క్షుణ్ణంగా అభ్యసించాడు. పరమగురువుల అశీస్సులు ,అభినందనలు పొంది చివరకు వారసత్వము పొందాడు. మధ్యలో తనతోటి అన్నదమ్ముని మరణము కొంత క్రుంగదీసినా ఆ కారణముగానే ఆధ్యాత్మికముగా ఎంతో ఉన్నతమయిన స్థాయికి యెదిగాడు. పువ్వు పుట్టగానే పరిమళము వెదజల్లినట్టు చిన్న వయస్సులోనే' పరమ గురువు చరణ సన్నిధి '[ ఎట్ ద ఫీట్ అఫ్ ద మాస్టర్] పుస్తకము వ్రాయుట ద్వారా తన ప్రతిభను చాటాడు.
ప్రపంచ వ్యాప్తంగా ఆయన అభిమానులు తమ యావదాస్తుల్నీ ఆయన ఆధిపత్యములోని తూర్పు దేశపు ధ్రువ తార [స్టార్ అఫ్ ద ఈస్ట్] అను సంస్థకు ధారపోశారు.ఆయన ప్రపంచ దేశాలన్నీ తిరుగుతూ ఉపన్యాసాలిచ్చేవారు.యావత్ప్రపంచమూ ఆయనను భగవంతుడిగానే కొలిచేవారు. అనీబిసెంటు అమ్మగారు,యితర పెద్దలు తాము నాటిన విత్తనము మహా వృక్షమయి ఫలాలను యివ్వడము చూసి గర్వపడేవారు.
అయితే రానురాను ఆ సమాజ సభ్యులూ ,ఆయన శిష్యులూ ఆయన దగ్గరకు వచ్చే భక్తులను ఆదాయము దృష్థితో కట్టడి చేసేవారు. ఆయనకు తాను విశ్వ మానవ సమాజములోనికి స్వేచ్చగా వెళ్ళలేకపోవడము బంధనము అనిపించి, సమాజ సభ్యుల సంకుచిత భావాలకు తిరుగుబాటు చేసి , సమాజానికి దానము చేసినవారికి యెవరి ఆస్తులు వారికే యిచ్చేసి తాను కేవలము మనిషినేనని అందరూ అనుకుంటున్నట్టు తాను భగవంతుడిని కానని ప్రకటించి సమాజ పెద్దలను కృంగదీసి యావత్ప్రపంచాన్నీ విస్మయ పరచి, మనిషిగా తన గొప్పదనాన్ని నిరూపించుకొని భగవంతుని సేవలోనే పూర్తిగా నిమగ్నమయి 1987 లో పరమపదించారు.
ప్రపంచమంతా తనను భగవంతుడుగా కొలుస్తుంటే పరిపక్వమయిన ఙ్ఞానముతో తాను డేవుడిని కానని-డేవుడిని కొలిచే మానవుడిని అని చాటిన ఆ మహా మనీషి మన తెలుగు వాడే కావడము మన అదృష్ఠము కాదా!
గురు దేవులు శ్రీ ఆంజనేయ స్వామి దయతో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నము చేస్తాను. ---కొమ్మూరు ఉమాప్రసాద్ భాగవతార్ . సెల్ 9848462805
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి