.

ఏమండీ! మీ యింటిలో పిల్లి ఉన్నాదా?

ఏమండీ! మీ యింటిలో పిల్లి ఉన్నాదా? శంకరరావు తనకు తెలిసిన వాళ్ళను, యిరుగు పొరుగు వాళ్ళను ఏమండీ! మీ యింటిలో పిల్లి వున్నాదా? అని అడుగుతున్నాడు. ఎవరిని అడిగినా లేదనే అంటున్నారు. పట్నం శివార్లకు వెళ్ళి అందరినీ అడుగుతుంటే అదృష్టము వలన పిల్లి దొరికింది. రెండు రోజుల శ్రమ ఫలించింది అని స్థిమితపడ్డాడు శంకరరావు. కీర్తి శేషులయిన తన తండ్రిగారి సంవత్సరీకము [ ఆబ్దీకము ] రోజున ఆ పిల్లిని తీసుకొని వచ్చి పాలు తాగించి దానిని వంటయింటిలోను ,పూజ గదిలోను కాకుండా సామానులగదిలో కట్టి, శుద్దిగా స్నానము చేసి తృప్తిగా తండ్రిగారికి, పెద్దలకు శాస్త్రవిహిత కర్మలను ఆచరించి సంతోషపడ్డాడు.
పిల్లి దొరకదేమోనని ఆందోళణ పడ్డాడేమో శంకరరావుకి ఆ రెండు రోజులు నిద్ర పట్టలేదు.తండ్రి అంటే చాలా ప్రేమ ,గౌరవము వున్నాయి . అయన తన తండ్రిగారికి,పెద్దలకు పితృ కర్మలను ఆచరించేటప్పుడు పిల్లిని కట్టి , శుద్ది అయి పూజలు చేయడము శంకరరావు చాలా పర్యాయములు గమనించే వాడు.తన తండ్రిగారి పద్దతులు పాటించి ఆయనపై తనకు గల గౌరవమును చూపించుకున్నాడు.
శంకరరావు నాన్నగారికి స్వగ్రామములో పౌరోహిత్యముతోపాటు వ్యవసాయము కూడా వున్నాది. పండిన ధాన్యమును ఎలుకల బారినుండి కాపాడుకోవడానికి ఆయన పిల్లిని పెంచేవారు. ఎంత పెంపుడు పిల్లి అయినా దైవకార్యములూ , పితృకార్యములూ చేసేటప్పుడు మాత్రము దానిని కట్టేసేవారు. అది గమనించిన మన సుబ్బారావు యింటిలో పిల్లి లేకపోయినా దానిని సంపాదించి మరీ పితృకర్మలను ఆచరించాడు.
విశాఖలో శ్రీ ఆంజనేయస్వామి ఆలయములో అయిదు సంవత్సరముల క్రిందట వేదపండితుల ఘోష్టిలో పెద్దలు యీ విషయమును చెప్పి యేది యెందుకు చేస్తున్నామో తెలుసుకునే ప్రయత్నము చేయకుండా గుడ్డిగా చేస్తున్నారు అని బాధపడ్డారు. శాస్త్ర పరిఙ్నానము అభ్యసించే ఆసక్తి తగ్గిపోతున్నాది. రాను రాను ఘనాపాటి లు కనుమరుగు అవుతున్నారు అని విచారము వెలిబుచ్చారు.
ఈ కర్మ భూమికి యేది మూలమో ఆ సంపదకు ఆదరణ తగ్గిపోతున్నాది. కొన్ని ఆధ్యాత్మిక సంస్థలు వేద సంపదలను అడుగంటిపోకుండా కృషి చేస్తున్నాయి గాని వాటికి పెద్దల అండదండలు , ప్రోత్సాహము చాలడము లేదు. శ్మశాన వైరాగ్యము లాగ సభలలో బాధపడి వూరుకోవడమేనా? పిల్లి మెడలో గంటలు కట్టే పుణ్యమూర్తులు లేరా?
.

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి