సంసారమనెడి విష వృక్షములో రెండే రెండు అమృత ఫలములు ఉన్నాయి.
అవి (1) కావ్యామృత రస పానము (2) సజ్జన సాంగత్యము.
వేదభూమి అయిన మన భారతావనిలో త్రేతాయుగము కన్నా ముందు నుండే నాగరికత ఉండేది. సహజ వనరులతో సిరిసంపదలతో స్వర్ణయుగములా భాసిల్లేది. విదేశీయుల నిరంతర దండయాత్రలతో, పరిపాలనలతో వొట్టిపోయిన బంగారుగని వలే మిగిలి పోయింది. మన అపార సంపదలను దోచుకుపోయిన పాశ్చాత్యులు వారి భాషను, వారి శీతలదేశపు అలవాట్లను మనకు అంటగట్టారు. అవి జాడ్యములా మన సంస్కృతులనూ , మన సాంప్రదాయాలనూ మంట గలిపి నాశనము చేశేశాయి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కనుమరుగు అవుతున్నాది. స్వార్ధము, అహంకారము, అసూయ,మోసము వంటి అవలక్షణాలు విచ్చలవిడిగా రాజ్యమేలుతున్నాయి. సగటు మనిషికి శాంతి కరువయింది.ఈ అవినీతి , కల్తీ మయమైన సమాజములో మనిషి సంసారము విష వృక్షములా మారిపోయింది. ఈ విష వృక్షములాంటి మన జీవితము చిగురించాలంటే మనము యీరెండు అమృత ఫలాలను కష్టించి ఫలింపచేసుకొని ఆరగించి జీవితమును ధన్యము చేసుకోవాలి.
(1)కావ్యామృత రసపానము :- ఆదికావ్యమయిన శ్రీరామాయణము, శ్రీ కృష్ణుని ఉపదేశమయిన శ్రీమద్భగవత్గీత, ఉపనిషత్తులు, పురాణములు, భగవత్పూజా గ్రంధములు , వ్రత కధలు, నీతి కధలు, భక్తి సంకీర్తనలు వంటి దైవ సంబంధమయిన గ్రంధములు ఎన్నో ఉన్నాయి. మన స్థాయికి తగినవి మనము చదువుకోవాలి. శ్రధ్ధతొ, భక్తితో, త్రికరణశుధ్ధితో పఠన - మనన - నిధి - ధ్యాసలతో చదువుకోవాలి.
(2) సజ్జన సాంగత్యము: మన చుట్టూ ఉన్నవారి ప్రభావము మన మీద పడుతుంది. వారి ఆలోచనలు గుణములు మనలో కూడా ప్రతిబింబిస్తాయి. మొహమాటానికి పోయి చెడు అలవాట్లకు లోనవకుండా మంచి వారి సహచర్యములో ఉండి సత్పురుషుల సన్నిధిలో మన జీవితాన్ని బంగారు మయముగా చేసుకోవాలని పెద్దల మాటలను ఉడుతాభక్తిగా మీకు గుర్తు చేస్తున్నాను.
" గురు దేవులు శ్రీ అంజనేయస్వామి" దయతో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నము చేస్తాను.
"జై మారుతీ" "జై జై మారుతీ"
"శ్రీరామ దాసానుదాసుడు" -శ్రీ మారుతీ పద భక్త -- ఉమాప్రసాద్ కొమ్మూరు. (తెలుగు బ్లాగు: 18782)
.
1 కామెంట్‌లు:
ఆన్ లైన్ ఋ మఱియు దాని గుణింతము వ్రాయాలంటే లేఖినిలో R వాడాలి. బరహలో నైతే Ru వాడాలి. Google Indic Transliteration ఒక అనూహ్య (unpredictable) మార్పిడి సాధనం కనుక దానిలో దొఱికిన ఎంపికలతో తృప్తిచెందడం తప్ప ఏమీ చెయ్యలేం.
-- తాడేపల్లి
కామెంట్‌ను పోస్ట్ చేయండి