.

దేముడిని తరిమేశాము.

దేముడిని తరిమేశాము. మన దేశ స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిలో వందల సంవత్సరాలు నిమగ్నమయిపోయిన పాత తరాలవాళ్ళు మన సనాతన సాంప్రదాయాలను,సంస్కృతులను, సంస్కారాలను వదలివేశారు. జైళ్ళలో మగ్గినవారు,ప్రాణాలు కోల్పోయినవారు, ఆస్తులు కోల్పోయినవారు ఆప్తులను కోల్పోయినవారు ఎక్కువ అయిపోయి మన కర్మ భూమిలో మన వేద భూమిలో అధ్యాత్మికత కొరవడింది. ఇప్పుడున్న పాత తరము వారికి - వారి ముందు తరాలవారినుండి వంశపారపర్యముగా రావలసిన ఆచారాలు కనుమరుగయినాయి. ఆధునిక ప్రపంచములో యాంత్రిక సౌకర్యాలు ఎక్కువ ప్రభావము చూపిస్తున్నాయి. ' చాకలిని[ వాషింగుమెషిను] ఇంటి లోనికి తెచ్చుకున్నాము - మంగలిని [షేవింగు సెట్టు ] ఇంటిలోనికి తెచ్చుకున్నాము- సినిమా హాలును[ టివి సెట్టు ] ఇంటిలోనికి తెచ్చుకున్నాము ఎక్కడో ఉన్న హిమాలయాల వాతావరణ్ణాన్ని [ఎ సి మెషిను ] ఇంటిలోనికి తెచ్చుకున్నాము- ఎక్కడో ఉన్న గంగను [కొళాయి నీరు] ఇంటిలోనికి తెచ్చుకున్నాము - కాని ఇంటిలో తర తరాలుగా ఉన్న దేముడిని మాత్రము తరిమేశాము ! అందుకే అతి వృష్టి, అనావృష్టి మాత్రమే కాకుండా చిత్ర విచిత్రమైన వ్యాధులు జనాలను కబళిస్తున్నాయి. ఇప్పుడు భక్తి లేదని కాదు ఉన్నాది కాని అది బహిర్ముఖ భక్తి మాత్రమే!
జై జై మారుతీ ------- ఉమాప్రసాద్ కొమ్మూరు [తెలుగు బ్లాగు 18782]
.

సంసారమనెడి విష వృక్షములో అమృత ఫలములు.

మాతృ దేవో భవ! పితృ దేవో భవ !! ఆచార్య దేవో భవ !!!
సంసారమనెడి విష వృక్షములో రెండే రెండు అమృత ఫలములు ఉన్నాయి.
అవి (1) కావ్యామృత రస పానము (2) సజ్జన సాంగత్యము.

వేదభూమి అయిన మన భారతావనిలో త్రేతాయుగము కన్నా ముందు నుండే నాగరికత ఉండేది. సహజ వనరులతో సిరిసంపదలతో స్వర్ణయుగములా భాసిల్లేది. విదేశీయుల నిరంతర దండయాత్రలతో, పరిపాలనలతో వొట్టిపోయిన బంగారుగని వలే మిగిలి పోయింది. మన అపార సంపదలను దోచుకుపోయిన పాశ్చాత్యులు వారి భాషను, వారి శీతలదేశపు అలవాట్లను మనకు అంటగట్టారు. అవి జాడ్యములా మన సంస్కృతులనూ , మన సాంప్రదాయాలనూ మంట గలిపి నాశనము చేశేశాయి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కనుమరుగు అవుతున్నాది. స్వార్ధము, అహంకారము, అసూయ,మోసము వంటి అవలక్షణాలు విచ్చలవిడిగా రాజ్యమేలుతున్నాయి. సగటు మనిషికి శాంతి కరువయింది.ఈ అవినీతి , కల్తీ మయమైన సమాజములో మనిషి సంసారము విష వృక్షములా మారిపోయింది. ఈ విష వృక్షములాంటి మన జీవితము చిగురించాలంటే మనము యీరెండు అమృత ఫలాలను కష్టించి ఫలింపచేసుకొని ఆరగించి జీవితమును ధన్యము చేసుకోవాలి.

(1)కావ్యామృత రసపానము :- ఆదికావ్యమయిన శ్రీరామాయణము, శ్రీ కృష్ణుని ఉపదేశమయిన శ్రీమద్భగవత్గీత, ఉపనిషత్తులు, పురాణములు, భగవత్పూజా గ్రంధములు , వ్రత కధలు, నీతి కధలు, భక్తి సంకీర్తనలు వంటి దైవ సంబంధమయిన గ్రంధములు ఎన్నో ఉన్నాయి. మన స్థాయికి తగినవి మనము చదువుకోవాలి. శ్రధ్ధతొ, భక్తితో, త్రికరణశుధ్ధితో పఠన - మనన - నిధి - ధ్యాసలతో చదువుకోవాలి.

(2) సజ్జన సాంగత్యము: మన చుట్టూ ఉన్నవారి ప్రభావము మన మీద పడుతుంది. వారి ఆలోచనలు గుణములు మనలో కూడా ప్రతిబింబిస్తాయి. మొహమాటానికి పోయి చెడు అలవాట్లకు లోనవకుండా మంచి వారి సహచర్యములో ఉండి సత్పురుషుల సన్నిధిలో మన జీవితాన్ని బంగారు మయముగా చేసుకోవాలని పెద్దల మాటలను ఉడుతాభక్తిగా మీకు గుర్తు చేస్తున్నాను.
" గురు దేవులు శ్రీ అంజనేయస్వామి" దయతో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నము చేస్తాను.
"జై మారుతీ" "జై జై మారుతీ"
"శ్రీరామ దాసానుదాసుడు" -శ్రీ మారుతీ పద భక్త -- ఉమాప్రసాద్ కొమ్మూరు. (తెలుగు బ్లాగు: 18782)
.