* మానవ జన్మము దుర్లభము. ఎనుబది నాలుగు లక్షల జీవరాసులలో భగవంతునితో సమాన స్థితిని పొందినవాడు , ఉత్తమోత్తముడు - మానవుడు ! భగవంతుని కనుగొనగలిగిన జన్మ - మానవజన్మ! అట్టి జన్మను ఎత్తియు భగవత్భజన చేయకున్నవానిని ద్విపాద పశువుగా యెన్నవచ్చును. యుక్తా యుక్త విచక్షణ జ్ఞానము కలిగిన మానవుడు దానిని సద్వినియోగము చేసుకొని ఆత్మానాత్మ వివేచనము కలిగి భగవదారాధన చేయవలెను.
*కలియుగమందు యజ్ఞ యాగాది క్రతువులు , తపో నిష్టా గరిష్టలు ఆచరణకు దుస్సాధ్యము . సులభమైనది 'స్మరణ ' మరియు ' కీర్తన '.
* కలిసంతరణోపనిషత్తులో...
శ్లోకము :- హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం
. . . . . . . కలౌ నాస్త్యేవ నాస్త్యేవ నాస్త్యేవ గతి రన్యధా !
తాత్పర్యము :- హరి నామ స్మరణ వినా కలియుగములో మోక్ష సాధనకు వేరే గతి లేదు.
* మనో నిగ్రహమునకు నామ సంకీర్తనము అవసరము. నవ విధ భక్తి మార్గములలో ' కీర్తన ' ఒక్కటి. మనో ధారణకు , భవరోగములకు దివ్యమైన ఔషధము భగవత్కీర్తన.
* భగవదనుభూతిని పొందుటకు సంకీర్తన యోగా అనునది సులువైన , తేలికైన , తిరుగులేని , సరి అయిన మార్గము మరియు సరి అయిన పద్దతి.
* అల్లోపతి వైద్యము , ఆయుర్వేదోపతి వైద్యము , నేచురోపతి వైద్యము మరియు హోమియోపతి వైద్యము యివన్నీ విఫలము అవ వచ్చునేమో గాని భగవన్నామోపతి వైద్యము యెట్టి పరిస్థుతులలోనూ విఫలము కాదు. స్మరించిన వారిని త్రప్పక తరింప జేయును. అని శ్రీ శివానంద మహర్షి అన్నారు.
---వివేక చూడామణి ( డా..రామక లక్ష్మణ మూర్తి)
.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి