దేవుడ్ని ఎలా అరాధించాలి, ఆయన అభీష్టము అధికారాలు ఏమిటి? ఏ పనులు చేస్తే , వేటిని మానుకుంటే మానవ జీవితము సార్ధకమవుతుంది? అనే విషయాలను దేవుడు మానవుల నిర్ణయానికి వదిలిపెట్టలేదు.
వీటికోసం ఆయన మానవులలోనుంచే కొందరు సజ్జనులను ఎన్నుకున్నారు. వారిద్వారా మానవాళికి తన ఆజ్ఞలను , హితవులను అందజేస్తున్నాడు. ఇలాంటి సత్పురుషులనే ఇస్లాం దైవ ప్రవక్తలని చెబుతోంది. మానవులు అజ్ఞానంతో సమస్యల సుడిగుండములో చిక్కుకున్నప్పుడు దయామయుడైన దేవుడు వారికి ఋజుమార్గం చూపేందుకు దైవ ప్రవక్తలను పంపించేవాడు. ఇస్లాం ప్రకారం దేవుడు ప్రతీ దేశములోను , ప్రతీ జాతిలోను దైవ ప్రవక్తలను ఉద్భవింప జేశాడు. వారందరు ఇస్లాం ధర్మాన్నే [ దైవ విధేయతా మార్గం ] బోధించారు.
అయితే దైవ ప్రవక్తల మరణానంతరము కొందరు స్వార్ధపరులు వారు తెచ్చిన దైవ గ్రంధాలను తారుమారు చేశారు. తిరిగి దేవుడు మరొక ప్రవక్తను పంపేవాడు. ఈ ప్రవక్తల పరంపరలలో అంతిమ దైవ ప్రవక్తగా ' మహనీయ మొహమ్మద్ 'ను ప్రభవింపజేశాడు. ఈయన ఒక ప్రత్యేక జాతికో , ఒక ప్రత్యేక కాలము కోసమో కాక ప్రళయం వరకు పుట్టబోయే యావత్తు మానవాళి కొరకు దైవ ప్రవక్తగా వచ్చాడు. కనుక ఏ దేశంలో వున్నా , ఏ జాతిలో పుట్టినా ప్రతీ ఒక్కరూ చివరి దైవ ప్రవక్త అయిన ' మొహమ్మద్ ' [ స అసం ] ను విశ్వసించడమే. ఆయన తెచ్చిన దైవ గ్రంధం ' ఖురాన్ " ను , ఆయన ప్రవచించిన సూక్తులను , ఆచరణ విధానాన్ని పాటించడమే విధి. తద్వారా మాత్రమే మనిషి నిజమైన ముక్తికి , మోక్షానికి అర్హుడవుతాడు.
ఓ మొహమ్మద్ ! వారితో చెప్పండి. మీరు దేవుడ్ని ప్రేమించినవారే అయితే నాకు విధేయత చూపండి. అప్పుడే దేవుడు మిమ్మల్ని ప్రేమిన్స్తాడు. మీ పాపాలను క్షమిస్తాడు.
[ దివ్య ఖురాన్ : 3.31 ]
[ తేది 16-08-96 ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రిక సౌజన్యంతో ]
కొమ్మూరు ఉమాప్రసాద్ భాగవతార్ ,తెది 26-02-2010.